కామారెడ్డి క్రైం: అధిక లాభాల ఆశ చూపించి ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ కంపెనీలో పెట్టుబడుల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాలోని కీలక నిందితుడిని తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉపాధి కోసం దుబాయికి వెళ్లొచ్చిన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రమణ తండాకు చెందిన భుక్యా నవీన్ అక్కడ తాను పనిచేసిన ఓ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీతో కుమ్మక్కయ్యాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన తమ్ముడు ప్రవీణ్‌తో కలిసి రామారెడ్డి ప్రాంత ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా అనేకమంది అమాయకులను టార్గెట్ చేశారు. వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేసి అధిక లాభాల ఆశ చూపిస్తూ లింకులను పంపి 7,636 మందితో రూ.కోట్లల్లో ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టించారు. రామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి మోసపోయినట్టు గ్రహించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గతనెల 31న నవీన్‌తో పాటు ప్రవీణ్‌లను రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో పరారీలో ఉన్న మరో ప్రధాన నిందితుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ముత్యాల నాయుడు అలియాస్ రొంగలి ముత్యాలు నాయుడుగా గుర్తించారు. అతడిని డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ వెబ్‌సైట్ల ద్వారా ప్రజలకు వాట్సాప్‌లో లింకులు పంపించి, పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడన్నారు. ఈ ముఠా బాధితుల పేర్లపై యూజర్ ఐడీలు సృష్టించి బ్యాంకు ఖాతాలు, క్యూఆర్ కోడ్‌ల ద్వారా నగదు స్వీకరించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ ద్వారా సాట్‌స్పోర్ట్స్, ఫ్యూచర్9.కామ్ వెబ్‌సైట్‌లకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు లభించాయని వెల్లడించారు. ఈ ముఠాలోని మిగిలిన నిందితులు, వారి బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ పరికరాలపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే వారిని సైతం అరెస్ట్ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.


