ఎల్‌నినో ప్రభావంతో తగ్గుముఖం పట్టిన వర్షాలు
భారీగా పడిపోయిన జలాశయాల నీటి నిల్వలు
బలిమెలలో నీటి నిల్వలు
తగ్గడంతో ఒడిశా విద్యుత్ కేంద్రం మూత
ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతోపెరుగుతున్న నీటి కొరత
వరుణుడిపైనే ఆశలు
సీలేరు: ఉత్తరాంధ్రకు ప్రసిద్ధి చెందిన సీలేరు జలాలు దశాబ్దాలుగా ప్రతి ఏటా పుష్కలంగా నీటితో కళకళలాడుతూ.. రాష్ట్రానికి నిరంతరం విద్యుత్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఎల్‌నినో ప్రభావం, ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, అందుబాటులో ఉన్న నీటిని ఇతర అవసరాలకు మళ్లించడం వంటి కారణాలతో బలిమెల, జోలాపుట్, గుంటవాడ, డొంకరాయి జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. దీంతో రానున్న రోజుల్లో సీలేరు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆగస్టు నెలలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది.
మూతపడిన ఒడిశా ఓహెచ్‌పీసీ పవర్ హౌస్
ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాలో సీలేరు నదిపై నిర్మించిన ఓహెచ్‌పీసీ విద్యుత్ కేంద్రానికి ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని బలిమెల జలాశయం నుంచి నీటిని సరఫరా చేస్తారు. ఎనిమిది యూనిట్ల ద్వారా 510 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ కేంద్రం ప్రస్తుతం మూతపడింది. బలిమెల జలాశయంలో ఒడిశాకు కేటాయించిన నీటి వాటా డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకోవడంతో సుమారు 20 రోజులుగా ఓహెచ్‌పీసీ పవర్ హౌస్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం ఒడిశా వాటాలో సుమారు రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో ఆ నీటిని సాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు.
వర్షాలపైనే ఆశలు
ప్రస్తుత పరిస్థితుల్లో బలిమెల, సీలేరు కాంప్లెక్స్ రిజర్వాయర్లలో నీటి మట్టాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. ఆగస్టులోకి ప్రవేశించినా పూర్తి స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రిజర్వాయర్లలో నీటి కొరత తీవ్రతరమవుతోంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే జలాశయాల్లోకి భారీగా నీరు చేరి నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉంది. లేకుంటే రానున్న రోజుల్లో జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన విద్యుత్ డిమాండ్
ఏపీ జెన్‌కోకు చెందిన సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లోని సీలేరు, డొంకరాయి, పొల్లూరు, సరిహద్దులోని మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం రోజువారీ విద్యుత్ ఉత్పత్తి వేసవితో పోలిస్తే తక్కువగా జరుగుతోంది. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెరగడంతో సీలేరు కాంప్లెక్స్‌పై విద్యుత్ డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్‌లో 34.9545 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అందుబాటులో ఉన్న నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవు.
– కేవీ రాజారావు, చీఫ్ ఇంజినీర్,
సీలేరు విద్యుత్ కాంప్లెక్స్
సీలేరు జలవిద్యుత్ కేంద్రం
నీటి మట్టాలు ఇలా..
జోలాపుట్టు: పూర్తిస్థాయి నీటిమట్టం 2750 అడుగులు. మంగళవారం నాటికి 2719.66 అడుగుల వద్ద నీరు ఉంది. గత ఏడాది ఇదే రోజున 2740.20 అడుగుల నీటిమట్టం నమోదైంది.
బలిమెల: పూర్తిస్థాయి నీటిమట్టం 1516 అడుగులు. ప్రస్తుతం 1460.00 అడుగుల వద్ద నీరు ఉంది. గత ఏడాది ఇదే రోజున 1467.20 అడుగుల నీటిమట్టం ఉంది.
గుంటవాడ: పూర్తిస్థాయి నీటిమట్టం 1360 అడుగులు. ప్రస్తుతం 1343.70 అడుగుల వద్ద నీరు ఉంది. గత ఏడాది ఇదే రోజున నీటి నిల్వ ఒక టీఎంసీ కంటే తక్కువగా ఉన్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి.
డొంకరాయి: పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు. ప్రస్తుతం 1022.30 అడుగుల వద్ద నీరు ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 8.9957 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
భారీగా తగ్గిన బలిమెల నీటి నిల్వలు
ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని బలిమెల జలాశయంలో ఈ ఏడాది నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. గత ఏడాది ఆగస్టు 4న 46.1262 టీఎంసీల నీరు ఉండగా.. ప్రస్తుతం మంగళవారం నాటికి 26.7773 టీఎంసీలకు పడిపోయింది. ఇప్పటికే జూన్ నాటికి ఒడిశా తన వాటా నుంచి 22.6865 టీఎంసీల నీటిని వినియోగించింది. దీంతో ఒడిశా వాటాలో ప్రస్తుతం సుమారు రెండు టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. ఫలితంగా అక్కడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మూతపడింది. బలిమెల, జోలాపుట్టు నీటిలో ఒడిశా వాటా రెండు టీఎంసీలను మినహాయిస్తే ప్రస్తుతం ఏపీ వాటాగా 24.7320 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లోని గుంటవాడ, డొంకరాయి రిజర్వాయర్లలో కలిపి 10.2225 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం బలిమెలలో నిల్వ ఉన్న నీటిని ఇరు రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు వినియోగించడం లేదు. సీలేరు కాంప్లెక్స్‌లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ద్వారా వస్తున్న ప్రవాహంతోనే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఉత్తరాంధ్రకు విద్యుత్ వెలుగులు అందించే సీలేరు జలాశయాలకు నీటి గండం ఏర్పడింది. ఏటా పుష్కలంగా నీటితో కళకళలాడే బలిమెల, జోలాపుట్టు, గుంటవాడ, డొంకరాయి రిజర్వాయర్లలో ఈసారి నీటి నిల్వలు భారీగా తగ్గాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే బలిమెలలో నీటి కొరత కారణంగా ఒడిశా విద్యుత్ కేంద్రం మూతపడగా.. రానున్న రోజుల్లో సీలేరు జలవిద్యుత్ ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


