సీలేరు: సీలేరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయిలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేసిన తరువాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని పార్వతినగర్, బూసుకొండ, శాండ్ క్వారీ గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో రెవెన్యూ, ఏపీ జెన్‌కో అధికారులు మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠం గతంలో నిర్వహించిన ఆర్థిక, సామాజిక స్థితిగతుల సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వాసితుల సర్వే వివరాలను గ్రామసభలో చదివి వినిపించారు. సర్వేలో తమ పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై అధికారులు పలుమార్లు గ్రామసభలు, సమావేశాలు నిర్వహించినప్పటికీ.. ఇప్పటివరకు హామీలు అమలుకు నోచుకోలేదని నిర్వాసితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠం స్పందిస్తూ.. గతంలో అధికారులు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని, నిర్వాసితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు.
ఏపీ జెన్‌కోలో ఉద్యోగాలు ఇవ్వాలి
మెగా ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కాకుండా ఏపీ జెన్‌కోలో నేరుగా కాంట్రాక్టు కార్మికులుగా నియమించాలని నిర్వాసితులు కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ముందుగా మెగా ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, అర్హత ఉన్న వారికి అనంతరం ఏపీ జెన్‌కో కార్పొరేషన్‌లో కాంట్రాక్టు కార్మికులుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బూసుకొండ, శాండ్ క్వారీ గ్రామాల్లో నిర్వాసితులతో అధికారులు గ్రామసభలు నిర్వహించారు.
డిమాండ్లు నెరవేర్చాకే పనులు
తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చిన తరువాతే నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతూ నిర్వాసితులు తహసీల్దార్ అన్నాజీరావుకు వినతిపత్రం అందించారు. నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఐదు సంవత్సరాల పాటు మెగా ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేసిన తరువాత ఏపీ జెన్‌కోలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం తమను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం, భూమికి బదులు భూమి ఇచ్చిన తరువాతే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ అన్నాజీరావు స్పందిస్తూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరికి ఏ ప్రయోజనం వర్తిస్తుందో వారికి తప్పకుండా అందిస్తామని, ఈ విషయంలో ఎవరూ అపోహలకు గురికావద్దని తెలిపారు. కార్యక్రమంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఎస్‌ఈ సీతారామ్, ఎస్‌ఈ (సివిల్) జాకీర్ హుస్సేన్, ఈఈ అప్పలనాయుడు, ఏడీఈ నాగార్జున పాల్గొన్నారు.
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ నిర్వాసితుల డిమాండ్


