లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే

Aug 5 2026 12:54 AM | Updated on Aug 5 2026 12:54 AM

సాక్షి,పాడేరు: మెగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్‌ చేశారు. మెగా డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన, మహిళా విభాగాల నేతలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టౌన్‌హాల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్సీలో అక్రమాలు, స్పోర్ట్స్‌ కోటా సహా ఇతర కోటాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై వచ్చిన ఆరోపణలు, బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ చేపడుతున్న ఉద్యమాలపై చర్చించారు. భవిష్యత్‌ పోరాటాల కార్యాచరణను రూపొందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడి అర్హులైన నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. స్పోర్ట్స్‌, ఇతర కోటాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి తప్పుడు జీవోలు జారీ చేయడం అన్యాయమన్నారు. మంత్రి నారా లోకేష్‌ ఉపాధ్యా య పోస్టులను రూ.లక్షల్లో అక్రమంగా విక్రయించారంటూ ఆయన ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులకు పోస్టులు దక్కకుండా అన్యాయం జరిగిందన్నారు.

ఆందోళనలు చేస్తున్నా..

డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విశ్వేశ్వరరాజు అన్నారు. నీట్‌ ప్రవేశ పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. ఏపీలో మెగా డీఎస్సీపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి లోకేష్‌ కూడా బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ బాధిత నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ నెల 6న పాడేరులో, 8న చింతపల్లి, కొయ్యూరు మండల కేంద్రాల్లో రిలే నిరసన దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ నెల 10న పాడేరు నియోజకవర్గ కేంద్రంలో ఐదు మండలాల నాయకులతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు.మండలాల పార్టీ అధ్యక్షులు సీదరి రాంబాబు, నుర్మాని మత్స్యకొండంనాయుడు, బి.అప్పారావు, కంకిపాటి గిరి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్‌, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొడుగు అచ్యుత్‌, జి.మాడుగుల వైస్‌ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్‌, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్‌కుమార్‌, ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కూడా సుబ్రహ్మణ్యం, పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మణ్‌, జిల్లా నేత చిట్టిబాబు, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కె.ఉర్వశిరాణి, ఎస్టీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, లకే రామకృష్ణపాత్రుడు, నరసింహమూర్తి, సీనియర్‌ మహిళా నేతలు గల్లోంగి లక్ష్మికొండమ్మ, కోడా సుశీల, లకే రామసత్యవతి, లోతా దేవుడు పాల్గొన్నారు.

మెగా డీఎస్సీలో అక్రమాలపై

సీబీఐ విచారణ చేయాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు డిమాండ్‌

చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement