కేజీబీవీలో కుళ్లిన కూరగాయలు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలో కుళ్లిన కూరగాయలు

Aug 5 2026 12:54 AM | Updated on Aug 5 2026 12:54 AM

కొయ్యూరు: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కుళ్లిపోయిన ఉల్లిపాయలు, పాడైన గోంగూర కట్టలు, పచ్చిమిరపకాయలను చూసి ఎస్టీ శాసనసభా పక్షం కమిటీ చైర్మన్‌, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, కమిటీ సభ్యుడు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి కూరగాయలను బాలికలకు వడ్డిస్తే వారి ఆరోగ్యం ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వారు స్థానిక కేజీబీవీని సందర్శించి స్టోర్‌ గదిని పరిశీలించారు. అక్కడ పాడైన గోంగూర కట్టలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను గుర్తించారు. ‘‘ఇలాంటి కూరగాయలను కూడా బాలికలకు పెడుతున్నారా?’’ అంటూ నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఏపీసీ స్వామినాయుడితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. అనంతరం వంట చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పరిశుభ్రత సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలికలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు పదో తరగతి బాలికలతో ఎమ్మెల్యేలు మాట్లాడారు. పదిలో ఆరు సబ్జెక్టుల్లో 600 మార్కులు సాధించే లక్ష్యంతో కష్టపడి చదవాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని అన్నారు. అనంతరం కేజీబీవీ ఎదురుగా ఉన్న రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అక్కడ బాలికలతో మాట్లాడి ఉత్సాహంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. పాఠశాలలో వంట సిబ్బంది కొరతను అక్కడి సిబ్బంది ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు.

సమస్య వివరించిన గింజర్తి విద్యార్థులు

గింజర్తిలో 3, 4, 5 తరగతులను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నుంచి ఎంఈవో కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఎమ్మెల్యేలకు తమ సమస్యను వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలు కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం పాడేరులో మరోసారి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించాలని సూచించారు.

అభివృద్ధి పనులకు వినతి

కొయ్యూరులో గ్యాస్‌ గోడౌన్‌ ఏర్పాటు చేయాలని, కాకరపాడు నుంచి కొయ్యూరు వరకు డబుల్‌ రోడ్డు మంజూరు చేయాలని, అవసరమైన చోట్ల వంతెనలు నిర్మించాలని ఎంపీపీ బడుగు రమేష్‌బాబు ఎమ్మెల్యేలను కోరారు. దీనిపై శిరీషాదేవి స్పందిస్తూ.. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పాడైన ఉల్లిపాయలు.. గోంగూర కట్టలు

బాలికల ఆరోగ్యంపై ఎస్టీ

శాసనసభా పక్షం కమిటీ ఆందోళన

వంటగదిలో అపరిశుభ్రతపై అసంతృప్తి

ఏపీసీకి ఫోన్‌.. పరిస్థితి

చక్కదిద్దాలని ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement