పెదబయలు: స్థానిక ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అరకులోయలో ఇటీవల నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటారని పీడీ పి.సురేష్‌కుమార్ తెలిపారు. కళాశాల నుంచి వివిధ క్రీడా విభాగాల్లో 24 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా.. 23 మంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ పి.కేశవరావు తెలిపారు. విద్యార్థుల ప్రతిభపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో పాడేరులో నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీలకు ఇంతమంది విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్, ఎగ్జామినర్ బాకూరు పాండురాజు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో శిక్షణ అందిస్తూ వారి క్రీడా ప్రతిభను వెలికితీసిన పీడీ సురేష్‌కుమార్‌ను అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.


