మన్యం బంద్‌కు అనుమతి లేదు | - | Sakshi
Sakshi News home page

మన్యం బంద్‌కు అనుమతి లేదు

Aug 5 2026 12:54 AM | Updated on Aug 5 2026 12:54 AM

పాడేరు డీఎస్పీ రాజా సింహారెడ్డి

పాడేరు: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8న మన్యం బంద్‌ నిర్వహించనున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే బంద్‌కు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేదని పాడేరు డీఎస్పీ రాజా సింహారెడ్డి తెలిపారు. బంద్‌ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం పాడేరులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 8న కొన్ని సంఘాలు మన్యం బంద్‌కు పిలుపునిచ్చినట్లు సమాచారం అందిందన్నారు. ఈ నెల 5 నుంచి 21 వరకు టెట్‌ పరీక్షలు జరుగుతున్నందున జిల్లాలోని పలువురు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని తెలిపారు. పాఠశాలలు కూడా యథావిధిగా కొనసాగుతా యని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం పోలీసుల బాధ్యత అన్నారు. బంద్‌ పేరుతో రహదారులను దిగ్బంధించడం, ప్రజలు, విద్యార్థుల రాకపోకలకు ఆటంకం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉద్యమకారులు లేవనెత్తుతున్న అంశాలపై గత నెలలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించి హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారని తెలిపారు. ఆ కమిటీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలంతా పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement