తుమ్మపాల: క్వారీ లారీలు రాకపోకలు సాగించేందుకు గెడ్డలు, వాగులను ధ్వంసం చేసి, ప్రత్యేక నిధులతో రోడ్డు నిర్మించడం తగదని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారం ఎస్సీ కాలనీ వాసులు మంగళవారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని, ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయకుండా కాలనీకి ఆనుకుని లారీల రాకపోకల కోసం ప్రత్యేక రోడ్డు వేయడం దారుణమన్నారు. గ్రామానికి శివారున ఉన్న తమ కాలనీ ప్రజల బాగోగుల గురించి స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ లారీలు మితిమీరిన వేగంతో రాకపోకలు సాగిస్తాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కరించేవరకూ రోడ్డు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోని భూలోకేశ్వరరావు, పాతపాటి బాబులు, బోని రాంబాబు, బచ్చలి శేఖర్, బచ్చలి గంగరాజు, మహిళలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
దళితులు,
రైతుల నిరసన


