తుమ్మపాల: మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు జీవితం ఆదర్శనీయమని, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన సేవలు అనన్యసామాన్యమైనవని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో పీజీఆర్ సమావేశం మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1977 లో దివిసీమ ఉప్పెన సమయంలో బాధితులకు ఆయన అందించిన పునరావాస సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా గ్రామీణాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


