విడిది | - | Sakshi
Sakshi News home page

విడిది

Aug 3 2026 12:49 AM | Updated on Aug 3 2026 12:49 AM

ఆంధ్రా కాశ్మీర్‌ లంబసింగి.. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. మంచు తెరలు, చల్లని గాలులు, పచ్చని కొండల మధ్య మరో కొత్త పర్యాటక ఆకర్షణ సిద్ధమవుతోంది. లంబసింగికి చేరువలోని కృష్ణాపురం ఫైనరీ ఇప్పుడు సరికొత్త సొబగులు అద్దుకుంటోంది. ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే పర్యాటకుల కోసం కాటేజీలు, టెంట్లు, ట్రెక్కింగ్‌ మార్గాలు, సాహస క్రీడలు వంటి సదుపాయాలతో రూపుదిద్దుకుంటోంది. పర్యాటక సీజన్‌ నాటికి అందుబాటులోకి వచ్చేలా సిద్ధమవుతోంది.

లంబసింగికి చేరువలో కొత్త పర్యాటక కేంద్రం

రూ.63 లక్షలతో తొలిదశ అభివృద్ధి పనులు

లగ్జరీ కాటేజీలు.. టెంట్లతో వసతి సౌకర్యం

ట్రెక్కింగ్‌.. సాహస క్రీడలకు ప్రత్యేక ఏర్పాట్లు

మరో రూ.50 లక్షలతో మరిన్ని సౌకర్యాలు

ప్రకృతి

ఒడిలో

చింతపల్లి: ఆంధ్రా కశ్మీర్‌గా పేరుగాంచిన లంబసింగికి సమీపంలోని కృష్ణాపురం పైనరీ (పర్యాటక కేంద్రం) త్వరలోనే పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని అన్ని వసతులతో కూడిన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

● జిల్లాలో ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకునే ప్రాంతాల్లో లంబసింగికి ప్రత్యేక గుర్తింపు ఉంది. చల్లని వాతావరణం, మంచు సోయగాలను ఆస్వాదించేందుకు ఇటీవల కాలంలో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. లంబసింగి, తాజంగి, చెరువులవేనం అందాలను వీక్షించిన అనంతరం పర్యాటకులు కొత్తపల్లి, డల్లాపల్లి, వంజంగి వైపు వెళ్తున్నారు.

● చింతపల్లి మార్గంలో ఉన్న కృష్ణాపురం పైనరీ తోటల వద్ద పర్యాటకులు ఆగి భోజనం చేయడం, సేదతీరడం, ఫొటోలు, సెల్ఫీలు దిగడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అటవీశాఖ నిర్ణయించింది.

రూ.63 లక్షలతో అభివృద్ధి

కృష్ణాపురం పైనరీ అభివృద్ధికి ప్రభుత్వం గత ఏడాది వనవిహారి పథకం కింద రూ.63 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో పర్యాటకులను ఆకట్టుకునేలా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కేరళ తరహాలో సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు మూడు లగ్జరీ కాటేజీల నిర్మాణం చేపట్టారు. ఒక్కో కాటేజీలో డబుల్‌ బెడ్‌రూమ్‌, లివింగ్‌ రూమ్‌, డ్రెస్సింగ్‌ రూమ్‌, వాష్‌రూమ్‌, టాయిలెట్‌ వంటి సదుపాయాలు ఉండనున్నాయి.

● చిన్నారుల కోసం ఆట స్థలాలు, సాహస క్రీడలకు సంబంధించిన పలు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా మూడు బయో టాయిలెట్లను నిర్మిస్తున్నారు. పైనరీ తోటల చుట్టూ సుమారు 4 కిలోమీటర్ల మేర విద్యుత్‌ దీపాలతో ట్రెక్కింగ్‌ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

రిజర్వేషన్‌ సౌకర్యం

కృష్ణాపురం పైనరీలో బస చేసేందుకు అందుబాటులోకి రానున్న కాటేజీలను పర్యాటకులు ముందుగానే రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. గత ఏడాది నుంచి ప్రవేశ రుసుం రూ.30గా నిర్ణయించారు. చిన్న టెంట్‌కు రూ.800, పెద్ద టెంట్‌కు రూ.1,200 అద్దెగా నిర్ణయించారు.

● అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగే పర్యాటక సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వసతి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణాపురం పైనరీలో అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇవి పూర్తయితే లంబసింగి పర్యాటక ప్రాంతానికి కృష్ణాపురం పైనరీ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

మరో రూ.50 లక్షలు.. మరిన్ని సౌకర్యాలు!

కృష్ణాపురం ౖపైనరీ అభివృద్ధికి మరో అడుగు పడింది. పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేలా ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోగా.. కొత్తగా మంజూరైన నిధులతో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ నిధులతో కేరళ తరహాలో మూడు సెమీ పర్మినెంట్‌ కాటేజీలు, ట్రిడెక్స్‌, పాత్‌వేలు, పూర్తి స్థాయి ఫెన్సింగ్‌, పర్యాటకుల కోసం ప్రత్యేక వంటశాల నిర్మించనున్నారు. దీంతో ప్రకృతి అందాల మధ్య బస చేయాలనుకునే వారికి కృష్ణాపురం పైనరీ మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారనుంది.

అందుబాటులోకి తెస్తాం

పర్యాటక సీజన్‌ నాటికి అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయి. చిన్నారులు ఆనందంగా గడిపేందుకు ఆట పరికరాలతో పాటు సాహస క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశాం. కాటేజీల నిర్మాణం పూర్తయింది. అదనంగా సెమీ పర్మినెంట్‌ కాటేజీలను కూడా ఏర్పాటు చేయనున్నాం. మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న పర్యాటక సీజన్‌ నాటికి అన్ని వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తాం.

– వై. నర్సింహరావు,

డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి, చింతపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement