సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర భక్తులతో పాటు గిరిజనుల ఆరాధ్యదేవత పాడేరు మోదకొండమ్మతల్లి శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయంలో శాకాంబరి ఉత్సవం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
● కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, గూడెంకొత్తవీధి జడ్పీటీసీ కిముడు శివరత్నం, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు దంపతులు తొలిపూజలతో కొలిచారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కూరగాయలు, ఆకుకూరలతో రూపొందించిన గణపతి, మోదమ్మతో పాటు పలువురు దేవతామూర్తుల ప్రతిమలను ఎమ్మెల్యే పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.
భక్తులకు ప్రసాద వితరణ
మోదమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు దంపతులు ప్రసాదాలను పంపిణీ చేశారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పసుపులేటి బాలరాజు, ఐఏఎస్ అధికారులు కిల్లు శివకుమార్, గుడిసె బాలకృష్ణ ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, ఇతర సభ్యులు వారిని దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. మోదమ్మ చిత్రపటాలు, అమ్మవారి ప్రసాదం అందజేశారు.
భక్తులతో కిక్కిరిసిన ఆలయం
శాకాంబరి అలంకరణలోని మోదకొండమ్మతల్లిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు మైదాన ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లలో కొంతసేపు వేచి ఉన్నప్పటికీ భక్తులు ఓపికగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
● మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. శాకాంబరి ఉత్సవాన్ని విజయవంతం చేయడంతో పాటు అన్ని విధాలా సహకరించిన భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, వివిధ వర్గాల వారికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కృతజ్ఞతలు తెలిపారు.
కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారి అలంకరణ
వైభవంగా ఉత్సవం
భారీగా తరలివచ్చిన భక్తజనం
ప్రత్యేక పూజలు.. ఉచిత ప్రసాద వితరణ
కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం


