సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం

Aug 3 2026 12:49 AM | Updated on Aug 3 2026 12:49 AM

హైపవర్‌ కమిటీలు వద్దు

ఆదివాసీ గిరిజన సంఘ జాతీయకార్యవర్గ సభ్యుడు అప్పలనర్స

పాడేరు: ఆదివాసీల రాజ్యాంగ హక్కులు, చట్టాల పరిరక్షణతో పాటు శతశాతం ఉద్యోగ రిజర్వేషన్‌ అమలు కోసం చేస్తున్న పోరాటాలు సమస్య పరిష్కారమయ్యే వరకు కొనసాగుతాయని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స తెలిపారు. సమస్య పరిష్కారానికి బదులు కాలయాపన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న హైపవర్‌ కమిటీలను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో శతశాతం ఉద్యోగ రిజర్వేషన్‌ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. హైపవర్‌ కమిటీలకు రాజ్యాంగ, చట్టబద్ధత ఉండదని అన్నారు. ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు గిరిజనేతరులు సుప్రీంకోర్టులో 1,600కుపైగా పిటిషన్లు వేసినా.. రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ ఉన్నతాధికారులు ఇప్పటివరకు గిరిజనులకు అనుకూలంగా ఒక్క కౌంటర్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేయలేదని ఆరోపించారు. దీంతో గిరిజన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయని అన్నారు. ఐదో షెడ్యూల్‌ ప్రాంత పరిరక్షణకు భూ పరిరక్షణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

7న అరణ్య గర్జన.. 8న మన్యం బంద్‌

జీవో నంబర్‌ 3 పునరుద్ధరణ, 1/70 చట్టం పరిరక్షణ కోసం ఈ నెల 7న పాడేరులో గిరిజన ఉద్యోగుల సంఘం, ఆదివాసీ, ప్రజా, విద్యార్థి, గిరిజన సంఘాలు, ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే అరణ్య గర్జన ర్యాలీ, బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని అప్పలనర్స పిలుపునిచ్చారు. 8న రాష్ట్రవ్యాప్తంగా మన్యం బంద్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సమస్యల పరిష్కారానికి ఉత్తర్వులు జారీ చేయాలని, శతశాతం ఆదివాసీ ఉద్యోగ రిజర్వేషన్‌ చట్టంపై ప్రకటన చేయాలని, 1/70 చట్టం పరిరక్షణకు కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాల్‌దేవ్‌, జీవో నంబర్‌ 3 సాధన, 1/70 చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా నాయకులు సాగిన ధర్మన్న పడాల్‌, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ, హ్యుమన్‌ రైట్స్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు తరడ రాము, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంతాల నాగేశ్వరరావు, డీఎల్‌ఓ రాష్ట్ర నాయకులు పెనుమల రంజిత్‌, మూల్‌ నివాస్‌ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్జా వై.కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కార్తీక్‌, శ్రీను, జీవన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వంతాల కృష్ణ, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు చిన్ని, విద్యార్థి సంఘం నాయకులు చిన్నారావు, బొండ గంగాధరం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement