రోడ్డు ప్రమాదంలోయువ రైతు మృతి
కొయ్యూరు: రావణాపల్లిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రావణాపల్లికి చెందిన యువ రైతు పాడి రాజా (25) మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కృష్ణదేవిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న సీఐ బి. శ్రీనివాసరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రావణాపల్లికి చెందిన రైతు రాజా తోటలూరులో యూటర్న్ తీసుకుంటుండగా కృష్ణదేవిపేట నుంచి వస్తున్న పిట్టాచలానికి చెందిన కొర్రు లక్ష్మణ్ బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కొర్రు లక్ష్మణ్ బైక్‌పై ఉన్న సింహాచలంకు స్వల్ప గాయాలు కావడంతో కృష్ణదేవిపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
యూటర్న్ వద్ద అప్రమత్తంగా ఉండాలి
ద్విచక్ర వాహనదారులు యూటర్న్ తీసుకునే సమయంలో వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనించాలని సీఐ శ్రీనివాసరావు సూచించారు. యూటర్న్ తీసుకునే విషయాన్ని వెనుక వాహనదారులకు ముందుగానే సిగ్నల్ ద్వారా తెలియజేయాలని తెలిపారు. లేకపోతే వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. వాహనదారులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


