కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు
సీఎం చంద్రబాబుమోసం చేశారు
ఎన్నికలకు ముందు అంగన్‌వాడీల ఆందోళనకు మద్దతు తెలిపి, అనేక హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మమ్మల్ని మోసం చేశారు. కనీస వేతనాలతో పాటు సామాజిక భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా నిర్లక్ష్యం వహించడం అన్యాయం. నెలకు రూ. 26 వేల వేతనం చెల్లించే వరకు మా పోరాటం ఆగదు.
– డి. నాగమ్మ, జిల్లా అధ్యక్షురాలు,
అంగన్‌వాడీ వర్కర్ల సంఘం
అంగన్‌వాడీల
కనీస వేతనాల కోసం పోరాటం
అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలకు కనీస వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో మేము పోరాడుతున్నాం. చాలీచా లని వేతనాలతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా అంగన్‌వాడీ సిబ్బందికి అందడం లేదు. విధుల్లో వారు తీవ్ర వెట్టిచాకిరికి గురవుతున్నారు. అంగన్‌వాడీలకు న్యాయం జరిగే వరకు మా సంపూర్ణ మద్దతుతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
– వి. ఉమామహేశ్వరరావు,
ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ
సాక్షి, పాడేరు: జిల్లాలోని 2,354 అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, ఆయాలు తమ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తారు. సీఐటీయూ, అంగన్‌వాడీ వర్కర్ల సంఘం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు, జిల్లాలోని అంగన్‌వాడీ సిబ్బంది ఒకరోజు వేతనాన్ని వదులుకుని మరీ కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్నారు. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి కలెక్టరేట్ వరకు వేలాదిమంది అంగన్‌వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని, నెలకు రూ. 26 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.
కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
అంగన్‌వాడీలు కలెక్టరేట్‌ను ముట్టడించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ తమ వద్దకు రావాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు కూటమి ప్రభుత్వంపై పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు.
సీఎం చంద్రబాబు మోసం చేశారు: సీఐటీయూ
ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు అంగన్‌వాడీల ఆందోళనలకు మద్దతు తెలిపిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక రెండున్నర ఏళ్ల పాలనలో మోసం చేశారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి సుందర్రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పోతురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాల పెంపుతో పాటు, అంగన్‌వాడీల ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. ప్రభుత్వం తమతో యుద్ధాన్ని కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు.
సమాన పనికి సమాన వేతనం ఏది?
అంగన్‌వాడీ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగమ్మ, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. అంగన్‌వాడీలు తీవ్రమైన వెట్టిచాకిరికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం పేరుతో తాము సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని వాపోయారు. నెలకు రూ. 26 వేల వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రత కల్పించాలని, పని ఒత్తిడిని పెంచుతున్న నవజీవన్ యాప్‌ను రద్దు చేయాలని, మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీలుగా మార్చాలని కోరారు. హామీలను నెరవేర్చని పక్షంలో ఈ నెల 31న మరోసారి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని వారు ప్రకటించారు.
డీఆర్వోకు వినతిపత్రం : ఆందోళన జరుగుతున్న ప్రదేశానికి డీఆర్వో లోకేశ్వరరావు చేరుకుని, అంగన్‌వాడీ సంఘం, సీఐటీయూ నేతల నుంచి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని స్వీకరించారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు సత్యారావు, ప్రసాద్‌తో పాటు అంగన్‌వాడీ సంఘం నాయకులు చిన్నారి, మోదకొండమ్మ, వెంకటలక్ష్మి, భారతి, పెంటమ్మ, అచ్చియమ్మ, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
డీఆర్వో లోకేశ్వరరావుకు వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ, అంగన్‌వాడీ యూనియన్ ప్రతినిధులు


