చింతపల్లి: జిల్లాలో విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐకేవీ రాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తొలిసారిగా చింతపల్లి అటవీ డివిజన్‌లో పర్యటించారు. ముందుగా కృష్ణాపురం ఫైనరీని సందర్శించి, పర్యాటకుల కోసం త్వరలో కల్పించనున్న వసతులు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం చింతలూరులోని కలప డిపోలో జరిగిన వేలం కార్యక్రమంలో పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై సమీక్ష:
తదుపరి చింతపల్లి డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన ఐకేవీ రాజు, అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యాలయ ఆవరణలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, నర్సరీలను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. అటవీ సంపదను కాపాడటంతో పాటు అడవుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమం ఇప్పటికే 80 శాతం పూర్తయిందని, మిగిలిన 20 శాతాన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అటవీ అధికారి వైవీ నరసింహారావు, రేంజ్ అధికారులు అప్పారావు, వెంకటరావు, ప్రశాంతి, ట్రైనీ రేంజ్ అధికారి మణికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఐకేవీ రాజు


