పిడుగుల పగ | - | Sakshi
Sakshi News home page

పిడుగుల పగ

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

భూతాపం పెరగడంతో జిల్లాలో వాతావరణం సెగలు రేపుతోంది. ఎండల తీవ్రతకు తోడు ఒక్కసారిగా కమ్ముకొస్తున్న మేఘాలు మన్యం వాసులపై పిడుగులై విరుచుకుపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిరోజూ వస్తున్న హెచ్చరికలు, సూర్యుని ఉపరితలం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేడితో పడుతున్న పిడుగులు జిల్లాలో ప్రాణ,ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. అసలు ఈ పిడుగులు ఎందుకుపడుతున్నాయి? ఏజెన్సీ ప్రాంతాల్లోనే వీటి ముప్పు ఎందుకు ఎక్కువ? చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం నిపుణుల విశ్లేషణ మీకోసం..
భూతాపం సెగ..

కొయ్యూరు : భూగోళం వేడెక్కుతున్న (గ్లోబల్‌ వార్మింగ్‌) ప్రభావం జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పిడుగుల తీవ్రత పెరుగుతోంది. సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉండటం వల్ల, మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పిడుగులు పడే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

మేఘాల ఘర్షణ..

30 వేల డిగ్రీల సెల్సియస్‌ వేడి

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆకాశంలో క్యూములోనింబస్‌ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఈ మేఘాల్లోని నెగటివ్‌ ఎలక్ట్రికల్‌ ఛార్జ్‌, భూమిపై ఎత్తుగా ఉండే కొండలు, చెట్లపై ఉండే పాజిటివ్‌ ఛార్జ్‌ను ఆకర్షిస్తుంది. ఈ ప్రక్రియలో పిడుగు పడినప్పుడు వెలువడే ఉష్ణోగ్రత సుమారు 30 వేల డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. ఇది సూర్యుని ఉపరితలంపై ఉండే వేడి కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

ఎత్తయిన ప్రాంతాల్లో ముప్పు ఎక్కువ

జిల్లాలోని కొయ్యూరు, చింతపల్లి, పాడేరు, అరకు వంటి ప్రాంతాల్లో ఎత్తయిన కొండలు, పొడవైన చెట్లు ఎక్కువగా ఉంటాయి. పిడుగులు సహజంగానే ఎత్తయిన ప్రదేశాలను ఆకర్షిస్తాయి. ఏప్రిల్‌, మే మాసాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరడం వల్ల పిడుగుల ప్రమాదం ఎక్కువగా ఉంటోంది. జూన్‌ నెలలో వాతావరణం చల్లబడ్డాక ఈ ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రాణహాని.. ఆస్తి నష్టం

పిడుగు నేరుగా మనుషులపై పడితే తీవ్రమైన ఎలక్ట్రికల్‌ షాక్‌తో గుండె ఆగిపోయి తక్షణమే మరణిస్తారు. సమీపంలో పడితే మెదడు పనితీరు మందగించడం, నరాలు బలహీనపడటం వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. కేవలం మనుషులకే కాకుండా, అడవుల్లో మేతకు వెళ్లే పశువులు, మేకలు, గొర్రెలు కూడా భారీ సంఖ్యలో మరణిస్తుండటంతో గిరిజన రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. విద్యుత్‌ స్తంభాలపై పిడుగు పడినప్పుడు ఇళ్లలోని టీవీలు, కంప్యూటర్లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు కాలిపోతున్నాయి. ఇటీవల (మార్చి 30) జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ భీమలోయ గ్రామానికి చెందిన గమ్మెల భాస్కరరావు పిడుగుపాటుకు మృతి చెందాడు. జీవాలు కూడా మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి.

మెరుపు కనిపిస్తే.. అప్రమత్తం కావాల్సిందే!

మెరుపు, ఉరుము ఒకేసారి సంభవించినప్పటికీ, కాంతి వేగం (సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు) శబ్ద వేగం కంటే ఎక్కువ కావడం వల్ల మెరుపు ముందు కనిపిస్తుంది. మెరుపు కనిపించిన వెంటనే ఉరుము వినిపించే లోపు సురక్షిత ప్రాంతానికి చేరుకోవడం ఉత్తమమని అధికారులు హెచ్చరిస్తున్నారు.విపత్తు నిర్వహణ సంస్థ మొబైల్‌ ఫోన్లకు పంపే అలర్ట్‌ మెసేజ్‌లను చూసి వెంటనే అప్రమత్తం కావాలి. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్‌ స్తంభాల దగ్గర లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. పక్కా భవనాల్లోకి వెళ్లాలి. ఉరుములు మొదలైనప్పుడు టీవీలు, రిఫ్రిజిరేటర్ల ప్లగ్‌లను సాకెట్ల నుంచి తొలగించడం మంచిదని వారు సూచిస్తున్నారు.

వాతావరణంలో మార్పులే కారణం

భూ తాపం పెరగడం వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. మేఘాల్లో ఛార్జ్‌ అయిన నెగిటివ్‌ ఎలక్ట్రికల్‌ ఛార్జ్‌, భూమిపై ఎత్తయిన ప్రాంతాల్లో ఉండే చెట్లు, భవనాలపై ఉండే పాజిటివ్‌ ఛార్జ్‌ను ఆకర్షించడం వల్లే పిడుగులు పడతాయి. ఏప్రిల్‌, మే నెలల్లో అప్రమత్తత చాలా అవసరం.

– ఎల్‌. అప్పలస్వామి, ఏడీఆర్‌, చింతపల్లి

వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన స్థానం

సెగలు కక్కుతున్న మన్యం

హడలెత్తిస్తున్న ఉరుములు, మెరుపులు

ప్రాణ, ఆస్తినష్టంపై ప్రభావం

అప్రమత్తతే ముఖ్యమంటున్న

ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ అప్పలస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement