చింతపల్లి: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహామండలి సమావేశం జరగనుంది. జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, పోలవరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 37 గిరిజన మండలాల పరిధిలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్య ఉదేశాలివీ..
మేలైన వంగడాల గుర్తింపు: గిరిజన ప్రాంత రైతులు పండిస్తున్న పంట రకాలు, వారు సాధిస్తున్న దిగుబడులపై చర్చించి, భవిష్యత్తులో సాగు చేయవలసిన మేలైన వంగడాలను సూచించడం.
సాంకేతికత అభివృద్ధి: చింతపల్లి, సీతంపేట పరిశోధనా స్థానాల ద్వారా గిరిజన పర్వత శ్రేణులకు అనువైన సాగు పద్ధతులను, పరివాహక ఆధారిత సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం.
శిక్షణ కార్యక్రమాలు: రైతులు, మహిళలు, గ్రామీణ యువతకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం.
సాగుపై శాస్త్రవేత్తల సూచనలు:
పర్వత శ్రేణి ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ కాలంలో, తక్కువ నీటితో పండే వరి, చిరుధాన్యాలు (మిల్లెట్స్), నూనెగింజల సాగుపై రైతులు దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కింది అంశాలపై చర్చిస్తారు.
నూతన పంటల సరళి: వాతావరణ మార్పులకు తట్టుకునే కొత్త పంటలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు.
ఎల్–నినో ప్రభావం: ఈ ఏడాది పంటలపై ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, వరి, అపరాలు, చెరుకు, మొక్కజొన్న పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను శాస్త్రవేత్తలు వివరించనున్నారు.
విస్తరణ సేవలు..
పాడేరు, రస్తకుంటుబాయి ఏరువాక కేంద్రాల ద్వారా ఆధునిక సాంకేతికతను రైతుల ముంగిటకు చేరవేసి, అధిక దిగుబడులు సాధించడమే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ అవకాశాన్ని గిరిజన రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ప్రకృతి సవాళ్లను ఎదుర్కొని.. సాగులో విజయం సాధించడమే లక్ష్యంగా చింతపల్లి వేదికగా కీలక అడుగు పడనుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్‌నినో ప్రభావం మన్యం వ్యవసాయంపై పడకుండా ఉండేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త సాగు వ్యూహాలను సిద్ధం చేశారు. తక్కువ నీరు, తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే వంగడాలపై రైతులకు దిశానిర్దేశం చేస్తూ.. గిరిజన రైతాంగానికి అండగా నిలిచేందుకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సిద్ధమైంది.
చింతపల్లిలో నేడు వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం
ఎల్‌నినో సవాలును తట్టుకునేలాసరికొత్త సాగుకు వ్యూహం
నూతన వంగడాలపై అవగాహన
రైతులకు దిశానిర్దేశం చేయనున్నఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలు
వ్యవసాయానికి అండగా ఆర్‌ఏఆర్‌ఎస్
ఎల్‌నినో ప్రభావంపై దిశానిర్దేశం
చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహించనున్న జెడ్‌ఆర్‌ఈఏసీ సమావేశంలో ఈసారి ప్రధానంగా ఎల్‌నినో ప్రభావంపై చర్చించబోతున్నాం. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడనున్న ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా, రాబోయే కాలంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని, రైతులు తక్కువ నీటితో, తక్కువ కాలంలో అధిక దిగుబడులు సాధించే పంటల వైపు మొగ్గు చూపాలి. ముఖ్యంగా వరి, వేరుశెనగ, వలిశెలు, రాజ్‌మా వంటి పంటలలో మేలైన సాగు పద్ధతులు, మా పరిశోధనా ఫలితాలను ఈ సమావేశం ద్వారా రైతులకు వివరించనున్నాం. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ఈ వేదిక ద్వారా దిశానిర్దేశం చేయనున్నాం. – డాక్టర్ అప్పలస్వామి, ఏడీఆర్, ఆర్‌ఏఆర్‌ఎస్, చింతపల్లి


