కలెక్టర్ నిశాంతి ఆదేశం
పాడేరు: ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ టి. నిశాంతి ఆదేశించారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ఇంచార్జ్ డీఆర్వో నీలకంఠేశ్వరరావు, ఇంచార్జ్ ఆర్డీవో లోకేశ్వరరావు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులకు కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయి గ్రీవెన్స్ డేలో ఎంపీడీవో, తహసీల్దార్, ఇంజనీరింగ్ విభాగాలు, అన్ని శాఖల అధికారులు విధిగా పాల్గొనాలని సూచించారు. గ్రీవెన్స్ కార్యక్రమం సక్రమంగా జరుగుతుందో లేదో జాయింట్ కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను వెంటనే సంబంధిత శాఖల లాగిన్‌లలో రిజిస్ట్రేషన్ చేసి, గడువులోపు పరిష్కరించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, ఆదేశాలను ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.


