పండగ పూట పన్నెడ గ్రామంలో పెను విషాదం అలుముకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. మత్స్యగెడ్డ రూపంలో మృత్యువు పొంచి ఉందని తెలియని ఆ చిన్నారులు.. నీటిలో మునిగి అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలల మృతితో ఆ ఊరంతా ఆవేదనలో మునిగిపోయింది.ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.
ప్రమాదం జరిగిన మత్స్యగెడ్డ ప్రదేశం
పెదబయలు: ఆ గ్రా మంలో అప్పటి వరకు ‘ఇటుకల పండుగ’ సందడి నెలకొంది. కానీ ఒక్క వార్త ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది. మత్స్యగెడ్డ రూపంలో మృత్యువు ముగ్గురు చిన్నారులను కబళించడంతో పన్నెడ గ్రామం కన్నీరుమున్నీరవుతోంది. మృతి చెందిన ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో తల్లిదండ్రుల ఆక్రందనలు అరణ్య రోదనగా మారాయి.
మృత్యుంజయడు కార్తీక్..
పన్నెడ గ్రామానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఎండ తీవ్రత తట్టుకోలేక ఆదివారం గ్రామ సమీపంలోని సీతగుంట పంచాయతీ లకేయిపుట్టు, పెదబయలు గ్రామాల మధ్యలో మత్స్యగెడ్డ వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో గెడ్డలో ఈత కొడుతుండగా పాంగి నవీన్ (15) సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. మిగిలిన కోడా కార్తీక్ (11), కోడా ప్రదీప్ (10), గొల్లోరి హర్షిత (10), పాంగి బబ్లు (10) నీటిలో మునిగిపోయారు. వీరిలో కోడా కార్తీక్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. కేకలు విని వచ్చిన చేపల వేటగాళ్లు కార్తీక్‌ను బయటకు తీసి, కడుపుపై నొక్కి ఊపిరి అందించడంతో అతడు కోలుకున్నాడు. ఎక్కువ మంది ఉండి ఉంటే మిగిలిన ముగ్గురిని కూడా కాపాడేవాళ్లం.. అని లకేయిపుట్టుకు చెందిన చేపల వేటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుల్లో ప్రదీప్ గిరిజన సంక్షేమ పాఠశాలలో 5వ తరగతి, హర్షిత, బబ్లు పన్నెడ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు.
పొంచివున్న ఊబి ప్రమాదం
మత్స్యగెడ్డలో ప్రస్తుతం నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ, లోపల ఉన్న ఊబి ప్రాణాంతకమవుతోంది. ఏటా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవుల దృష్ట్యా పిల్లలు గెడ్డల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పండగ పూట
ముగ్గురు చిన్నారుల బలి
మత్స్యగెడ్డలో రాలిన పసి మొగ్గలు
ఆటపాటల వేళ.. అనంత లోకాలకు..
మిన్నంటిన రోదనలు


