ఆ ఊర్లన్నీ మత్స్యగెడ్డ చుట్టూనే.. కానీ ఆ గెడ్డే వారి పాలిట మృత్యుపాశం! ప్రాణం అరచేతిలో పెట్టుకుని నాటు పడవ ఎక్కితే కానీ.. పైసా రాదు, మెతుకు దొరకదు. చదువుకోవాలన్నా, రోగం వచ్చినా ఆ ప్రమాదకర ప్రయాణం తప్పదు. ఒకవైపు 91 మంది బలి తీసుకున్న మృత్యు గెడ్డ.. మరోవైపు అధికారుల, నేతల హామీల నీటి మూటలు.. ఇది ముంచంగిపుట్టు మండలంలోని 86 గ్రామాల గిరిజనుల నిత్య ఘోష.
ప్రమాదం జరిగి ప్రాణాలు పోయినప్పుడు మాత్రమే ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు (కలెక్టర్లు, ఐటీడీఏ పీవో లు) ఘటనా స్థలానికి వస్తుంటారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇస్తూ, వంతెనలు కట్టిస్తామంటూ గుప్పించే హామీలు.. వారు వెనుదిరగగానే గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నేతలు ఇచ్చే హామీలు, నీటిపై రాతలుగానే మిగిలిపోతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదు అని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంచంగిపుట్టు: మండలంలోని సుమారు 86 గ్రామాలకు చెందిన గిరిజనులకు మత్స్యగెడ్డ దాటనిదే రోజు గడవదు. నిత్యావసర సరకులు తెచ్చుకోవాలన్నా, వ్యాపార లావాదేవీలు జరపాలన్నా, చివరకు పిల్లలు చదువుకోవాలన్నా.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నాటు పడవలపై ప్రయాణించాల్సిందే. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ జలకష్టాలు గిరిజన వాడల్లో కన్నీళ్లు మిగులుస్తున్నాయి.
అడుగడుగునా ప్రమాదాలే..
పనసపుట్టు, సుజనకోట, పెదగూడ, దారెల, వనుగుమ్మ, జోలాపుట్టు, మాకవరం, రంగబయలు వంటి పంచాయితీల్లో మత్స్యగెడ్డ విస్తరించి ఉంది. చేపల వేట కోసం, పనుల నిమిత్తం రోజూ వందలాది మంది నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో పడవలు మునిగి ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 91 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు.
● సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామం వద్ద పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ గిరిజనులు ఒక తాడు సాయంతో పడవను లాక్కుంటూ ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు.
స్వయంకృషితోనే జీవనం
ప్రభుత్వ సాయం అందకపోయినా, గిరిజన మత్స్యకారులు సుమారు 30 నుంచి 40 వేలు సొంతంగా ఖర్చు పెట్టుకుని నాటు పడవలను తయారు చేసుకుంటున్నారు. వీటిపైనే చేపల వేట సాగిస్తూ, సంతల్లో అమ్ముకుని జీవనం గడుపుతున్నారు. కుమ్మరిపుట్టు వద్ద తక్షణమే పక్కా వంతెన నిర్మించి రవాణా సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. రాయితీపై ఇంజిన్ బోట్లు, నాణ్యమైన వలలు పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వంతెన ప్రతిపాదనలను పక్కన పెట్టకుండా, గిరిజన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పరిసర గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.
వంతెన నిర్మించాలి
మత్స్యగెడ్డ ప్రమాదాల్లో మృతి చెందిన గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలి. గిరిజన మత్స్యకారులకు బోట్లు, వలలు ఉచితంగా అందించాలి. కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై సైతం వంతెన నిర్మించాలి.
– వెంగడ రమేష్, సర్పంచ్, సుజనకోట, ముంచంగిపుట్టు మండలం
హామీలకే పరిమితం
పడవ ప్రమాదాలు, గెడ్డలో మునిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, మంత్రులు వచ్చి కుమ్మరిపుట్టు మత్య్సగెడ్డపై వంతెన నిర్మాణానికి హామీ ఇస్తున్నా కార్యరూపం దాల్చలేదు.
–గోవింద్, కుమ్మరిపుట్టు, ముంచంగిపుట్టు మండలం
ప్రతిపాదనలు పంపాం
బోట్లు, వలలు రాయితీపై అందించాలని ఆరు పంచాయతీల్లో మత్స్యగెడ్డ ప్రాంతాల గిరిజనులు ఇప్పటికే విన్నవించారు. వీటితోపాటు కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన నిర్మించాలని వారు కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టేలా తగు చర్యలు తీసుకుంటాం.
– భాస్కర అప్పారావు, తహసీల్దార్, ముంచంగిపుట్టు


