ప్రధాని మౌనం దేశానికే ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ప్రధాని మౌనం దేశానికే ప్రమాదం

Mar 12 2026 7:30 AM | Updated on Mar 12 2026 7:30 AM

పాడేరు రూరల్‌: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న మౌనం దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు విమర్శించారు. బుధవారం పాడేరు పట్టణ ప్రధాన రహదారిపై సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అమెరికా తన స్వార్థం కోసం సామ్రాజ్యవాద యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని, దీనివల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏకపక్ష నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, దీని ప్రభావం వల్ల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల దేశవ్యాప్తంగా గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిపై భారంగా మారాయని ఆయన విమర్శించారు. ప్రపంచ దేశాలతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా కేంద్రం తన మౌనాన్ని వీడి అంతర్జాతీయ వేదికలపై శాంతి కోసం గళం ఎత్తాలని, లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు కార్తీక్‌, జీవన్‌, వరహాలు, సీఐటీయూ నాయకులు సూరిబాబు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement