ముంచంగిపుట్టు: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన జోలాపుట్టు, డుడుమ జలాశయాలను జాతీయ డ్యాం సేఫ్టీ బృందం సందర్శించింది. ఈ జలాశయాలు అతి పురాతనమైనవి కావడంతో, వాటి ఆయువుపట్టు, ప్రస్తుత స్థితిగతులను పరిశీలించేందుకు ఢిల్లీకి చెందిన ముగ్గురు సభ్యుల బృందం సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టింది. జలాశయాల గేట్లు, టర్బైన్లు, మరియు నీటి విడుదల ప్రక్రియను బృందం సభ్యులు నిశితంగా పరిశీలించారు. కాంప్రహెన్సివ్ డ్యాం సేఫ్టీ ఇవాల్యుయేషన్ చైర్మన్ కమలేష్ జైన్ మాట్లాడుతూ.. అత్యంత పురాతనమైన మాచ్‌ఖండ్ ప్రాజెక్టు నిర్వహణలో ఇంజనీర్ల కృషి బాగుందని కొనియాడారు.ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని హెరిటేజ్ ప్రాజెక్టుగా పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు.జలాశయాల వద్ద విద్యుత్ దీపాలంకరణ మెరుగుపరచాలని, తద్వారా పర్యాటక శోభ పెరుగుతుందని సూచించారు. కొన్ని గేట్ల పనితీరుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు వాటిని ప్రయోగాత్మకంగా ఆపరేట్ చేసి చూశారు. జలాశయాల్లో ప్రతి ఏడాది ఉండే నీటి నిల్వలు, చేపట్టాల్సిన మరమ్మతు పనులపై స్థానిక అధికారులతో చర్చించారు. ముఖ్యంగా జోలాపుట్టు జలాశయం వద్ద చేపట్టవలసిన పనులపై త్వరలోనే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక పంపుతామని బృందం వెల్లడించింది. ఈ తనిఖీల్లో ఏపీజెన్‌కో ఎస్.ఈ శ్రీనివాసరెడ్డి, సివిల్ ఎస్‌ఈ (సీలేరు) షేక్ హుస్సేన్, ఈఈ కురుషు ప్రధాన్, ఏడీఈ వెంకటమధు, ఏఈలు పాల్గొన్నారు.
జోలాపుట్టు, డుడుమ జలాశయాల పరిశీలన


