కొయ్యూరు: మండలంలోని బాలారం, గింజర్తి గ్రామాల్లోని పాఠశాలల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు జిల్లా విద్యాశాఖాధికారి రామకృష్ణారావు బుధవారం తెరదించారు. స్థానిక తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఆయన, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు తమ సొంత గ్రామాల పాఠశాలల్లోనే చదువుకునేలా చర్యలు చేపట్టారు.
గింజర్తి పాఠశాల వివాదం..
గతంలో చింతలపూడి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్ది, గింజర్తి విద్యార్థులను అక్కడికి పంపాలని అధికారులు ఆదేశించారు. అయితే, విద్యార్థులు ఎక్కువగా ఉన్న తమ పాఠశాలను వదిలి, తక్కువ మంది ఉన్న చోటికి పంపలేమని గింజర్తి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన డీఈవో బుధవారం గింజర్తి పాఠశాలను సందర్శించి తల్లిదండ్రులతో చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3–5 తరగతుల విద్యార్థులు గింజర్తి పాఠశాలలోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు.
బాలారం పాఠశాలలో యథావిధిగా తరగతులు..
బాలారం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న వారు ఇద్దరే ఉండటంతో, 3–5 తరగతుల విద్యార్థులను జిల్లా పరిషత్ పాఠశాలకు పంపాలని గతంలో నిర్ణయించారు. దీనిపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో డీఈవో అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఎక్కడికీ పంపకుండా, యథావిధిగా బాలారంలోనే తరగతులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
అంగన్‌వాడీలకూ ఆదేశాలు..
అనంతరం డీఈవో అంగన్‌వాడీ కార్యకర్తలతో మాట్లాడారు. పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని, ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
పదిలో మంచి ఫలితాలు సాధించాలి
బాలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈవో సందర్శించారు.పది విద్యార్థులకు సలహాలు చేశారు. త్వరలో ప్రారంభమయ్యే పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలని కోరారు.ఈ సందర్భంగా సబ్జక్ట్‌ల వారీగా సమీక్ష చేశారు. ఆయనను ఎంఈవో సింహాచలం సత్కరించారు.


