ఏజెన్సీలో రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు
జి.మాడుగుల: జిల్లాలోని గిరిజన గ్రామాలకు ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక నిధులు కేటాయించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు కోరారు. మండలంలోని గెమ్మెలి పంచాయతీ చీమలపాడు గ్రామంలో రూ.1.60 కోట్లతో తారురోడ్డు నిర్మాణ పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను విజయం సాధిస్తే గెమ్మెలి రోడ్డు నుంచి చీమలపాడు వరకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం పనులు చేపట్టామన్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి రహదారులు కీలక ప్రాత పోషిస్తాయని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు రవాణాలో సౌలభ్యం కలుగుతుందని ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పక్కాలు రోడ్లు నోచుకోకపోవడంతో ప్రజలు రోడ్డు, రవాణా కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం, అధికారులు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండం నాయుడు, సర్పంచ్ సీదరి కొండబాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంజరి సీతారాంనాయుడు, వైఎస్సార్‌సీపీ నేతలు సిర్మా పండన్న, బంగార్రాజు, నీలమ్మ, వలసయ్య, చిట్టిబాబు, మన్మథరావు, లక్ష్మినాయుడు, బాలయ్యపడాల్, గంగరాజు, మర్రి బాలరాజు, కోటిబాబు, బొనంగి బాలయ్య పడాల్, శంకరరావు, సత్తిబాబు, ఆశీర్వాదం, బాలు, కొండబాబు, మాజీ సర్పంచ్ పండుదొర, కూర్మారావు, పీఆర్‌ఏఈ మాణిక్యం, సీడీపీవో బాలచంద్రమణిదేవి, ఉపాధి హామీ పథకం ఏపీవో కొండబాబు పాల్గొన్నారు.
మంజూరు చేయాలని పాడేరు ఎమ్మెల్యే
విశ్వేశ్వరరాజు విజ్ఞప్తి


