జీవన సత్య పట్టుదల అందరికీ ఆదర్శం
● అథ్లెట్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా
● అరకు ఎంపీ తనూజరాణి
● రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత
పాడేరు: నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆదివాసీ బాలిక జీవన సత్య పట్టుదల అందరికీ ఆదర్శమని, భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా ఆమెను మార్చే బాధ్యత తీసుకుంటానని అరకు ఎంపీ తనూజరాణి హామీ ఇచ్చారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన 10కే మారథాన్‌లో రన్నరప్‌గా నిలిచి సంచలనం సృష్టించిన ఆమెను శనివారం పాడేరులోని తన నివాసంలో ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. అరకువ్యాలీలోని శారదానికేతన్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఆమె ప్రతిభను కొనియాడారు. ఆమెకు తక్షణ అవసరాల కోసం తన సొంత నిధులు రూ.10 వేల నగదు అందజేశారు. ఆమెను ఉత్తమ క్రీడాకారిణిగా తీర్చిదిద్దేందుకు ఒక మంచి క్రీడా అకాడమీలో చేర్పించి, నాణ్యమైన శిక్షణ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, అడ్డుమండ సర్పంచ్ గుమ్మా శ్యాం సుందర్, రూఢకోట సర్పంచ్ కాతరి సురేష్‌కుమార్, నేతలు ఎల్‌బీ కిరణ్, బాలకృష్ణ, ప్రకాశ్, విజయ్ పాల్గొన్నారు.


