విద్యార్థుల ఆరోగ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: విద్యార్థుల ఆరోగ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. శనివారం ఆయన స్థానిక పీటీజీ బాలుర కళాశాల, బాలికల పాఠశాలను సందర్శించారు. కళాశాలలో ఆనారోగ్యంతో బాధపడుతూ రక్త పరీక్షలు చేయించుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య, మెనూ ప్రకారం భోజనం అందుతుందా.. లేదా అని ప్రశ్నించారు. రికార్డులు పరిశీలించిన ఎమ్మెల్యే మెనూ ప్రకారం వండి వడ్డిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పాఠశాలలో రుచికరంగా భోజనం లేకపోవడాన్ని గుర్తించిన ఎమ్మెల్యే తగు సూచనలు చేశారు. పాఠశాలలో ప్రహరి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పాఠశాలకు ప్రహరి నిర్మించి, పాఠశాల స్థలం కబ్జాకు గురికాకుండా చూడాలని సూచించారు. టెన్త్ విద్యార్థులకు యూనిఫారం అందించారు. మహిళా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


