యూనియన్ బ్యాంక్‌లో నో క్యాష్
● రాజవొమ్మంగిలో వెనక్కి పంపేస్తున్నబ్యాంకు అధికారులు
● ఆవేదన వ్యక్తం చేస్తున్న పెన్షనర్లు
రాజవొమ్మంగి: స్థానిక యూనియన్ బ్యాంక్ అధికారు ల తీరుపై రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ తీసుకోవడం కోసం శనివారం బ్యాంకుకు వెళ్లిన వృద్ధులకు నగదు లేదు అంటూ అధికారులు సమాధానం ఇచ్చి వెనక్కి పంపేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణవర్మ మాట్లాడుతూ, బ్యాంకు పరిధిలో వంద మందికి పైగా పెన్షనర్లు ఉన్నారని తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా బ్యాంకు సిబ్బంది నగదు లేదనే సాకుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బ్యాంకుకు వచ్చే వారిలో మెజారిటీ పెన్షనర్లు 80 ఏళ్లు పైబడిన వారే. లోతట్టు గ్రామాల నుండి ఎంతో శ్రమకోర్చి, ప్రయాణ ఖర్చులు భరించి బ్యాంకుకు వస్తే, నగదు లేదనడం వల్ల వారు శారీరకంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కృష్ణవర్మ పేర్కొన్నారు.పెన్షనర్ల పట్ల బ్యాంకు అధికారులు ప్రదర్శిస్తున్న ఉదాసీన వైఖరిపై రీజినల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉన్నతాధికారు లు వెంటనే స్పందించి, పెన్షనర్లకు సకాలంలో నగదు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


