లక్ష్మీపురం వైద్యాధికారి తీరుపై ఆందోళన
● మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపణ
● ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్‌కు ఫిర్యాదు
● తక్షణం బదిలీ చేయాలని డిమాండ్
చింతూరు: మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న లక్ష్మీపురం పీహెచ్‌సీ వైద్యుడితో పాటు అతనికి సహకరిస్తున్న డీఎంహెచ్‌వోను ఏజెన్సీ నుంచి బదిలీ చేయాలని ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది స్థానిక ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుష్టి జోగారావు, సలహాదారుడు మడివి నెహ్రూ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష్మీపురం పీహెచ్‌సీ వైద్యుడు మురళీకృష్ణ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు. డీడీవో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన డీఎంహెచ్‌వో అండతో మహిళా ఉద్యోగులను అక్రమంగా బదిలీ చేస్తున్నారని, కులాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆదివాసీ ఉద్యోగులను చులకన భావంతో చూడడంతో పాటు మహిళా ఉద్యోగులను అక్రమంగా వేధిస్తున్న వైద్యాధికారిని వెంటనే ఇక్కడి నుంచి పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, వైద్యసిబ్బంది ఐటీడీఏ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు చంద్రమ్మ, కుమారి, సమ్మక్క, నాగమణి, జయ, రాంప్రసాద్, సీతమ్మ, శశికళ, సీతమ్మ, రాజేష్, ఉత్తర, సత్యన్నారాయణ, సుందర్, విజయ్ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవో విచారణ:
మహిళా ఉద్యోగుల ఫిర్యాదుపై స్పందించిన ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్యతో కలసి వారి సమక్షంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యాధికారి మురళీకృష్ణను విచారించారు. యూనియన్ నాయకులతో పాటు మహిళా సిబ్బంది నుంచి పూర్తి వివరాలు సేకరించిన ఆయన బదిలీలు, వేధింపులపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటానని వారికి హామీనిచ్చారు.
లక్ష్మీపురం వైద్యాధికారి తీరుపై ఆందోళన


