గిరిజన విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యాలయాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నివేదికలు సమర్పించాలని ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రహరీల మరమ్మతులు, కొత్త ప్రహరీల నిర్మాణం, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, మరుగుదొడ్లు, సిక్ రూమ్‌ల మరమ్మతులు, రన్నింగ్ వాటర్ సదుపాయానికి సంబంధించి నివేదికలు సమర్పించాలన్నారు. విద్యార్థుల ఐడీ, ఆధార్ కార్డుల్లో తప్పులు సరిచేయించాలన్నారు. అవసరమైన చోట్ల మొబైల్ ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు డ్రాయింగ్, క్విజ్,్ గ్రూప్ డ్యాన్సులు నిర్వహించాలన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి మండలస్థాయి, తరువాత ఐటీడీఏ స్ధాయిలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. రిప్లబిక్ డేకు ఈ పోటీల్లో ఎంపికై న విద్యార్ధులను రంపచోడవరం తీసుకురావాలన్నారు. పోటీలు ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే నిర్వహించాలన్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాస్ కాఫీయింగ్‌కు అవకాశం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షల విధానంపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీవో డీఎన్‌వీ రమణ, ఏజెన్సీ డీఈవో వై మల్లేశ్వరరావు, ఏటీడబ్ల్యూవోలు బి. చిన్నిబాబు, కృష్ణమోహన్, జె శంభుడు పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్
గిరిజన విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు


