సమస్యలు పరిష్కారం వేగవంతం
● ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో
తిరుమణి శ్రీపూజ
● మీకోసం పీజీఆర్‌ఎస్‌కు 79 వినతులు
పాడేరు : మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో స్వీకరించిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని గడువులోగా పరిష్కారం చేయాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై 79 వినతులను స్వీకరించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అధికంగా రెవెన్యూ, వైద్యారోగ్య, డీఆర్డీఏ శాఖలకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయన్నారు. ఆయా శాఖల అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మండల స్థాయి అధికారులు దిగువ స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీదారులు 1100 మీకోసం కాల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో అంబేడ్కర్, ఇంచార్జీ ఆర్డీవో లోకేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, డీఆర్డీఏ పీడీ మురళి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నంద్, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


