మెరుగైన బోధన అందించాలి
ఎంఈవో కృష్ణమూర్తి
ముంచంగిపుట్టు: ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఎంఈవో కె.కృష్ణమూర్తి అన్నారు. మండలంలోని మారుమూల చీపురుగొంది, కిముడుపుట్టు, పిట్టగెడ్డ, డెంగగూడ మండల పరిషత్, జీపీఎస్ పాఠశాలలను ఎంఈవో కృష్ణమూర్తి శుక్రవారం సందర్శించారు. వాగులు, గెడ్డలు దాటుకొని ఎంఈవో అతికష్టం మీద వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడి వారి వర్క్ బుక్స్‌ను పరిశీలించి, తప్పలను సరిదిద్దారు.విద్యార్థులకు పాఠాలు బోధించారు. పలుప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల ఆన్‌లైన్ హాజరు తప్పని సరిగా నమోదు చేయాలని, ఆన్‌లైన్ పనులను సైతం వెంటనే పూర్తి చేయాలని, లెసన్ ప్లాన్, ఇయర్ ప్లాన్ డైరీలను ఖచ్చితంగా పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని, చదువులో వెనకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, బడిబయట పిల్లలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, మధ్యాహ్న భోజనాన్ని పక్కాగా అమలు చేస్తూ నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఎంఈవో కృష్ణమూర్తి ఉపాధ్యాయులకు సూచించారు.
మెరుగైన బోధన అందించాలి


