2 కేజీల గంజాయి పట్టివేత
● ముగ్గురు నిందితుల అరెస్టు
గొలుగొండ: మండలంలోని ఏటిగైరంపేట గ్రామం వద్ద రెండు కిలోల గంజాయితో నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్‌ఐ రామారావు తెలిపారు. ఏజెన్సీ నుంచి రెండు కిలోల గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. చింతపల్లి మండలానికి చెందిన నిందితులు దాసరి శ్రవంత్‌కుమార్(30), తుపాకుల హరీష్‌కుమార్(22), కొవ్యూరు సుమంత్(25)లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. కార్యక్రమంలో గొలుగొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా తిరువీధి సేవ
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాకవేంకటేశ్వర స్వామివారికి శుక్రవారం గజవాహనంపై తిరువీధిసేవలు నిర్వహించారు. కొండపై మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, నిత్యార్చనలు పూర్తిచేశారు. అనంతరం స్వామి వారి ఉత్సవమూర్తులకు, గోదాదేవి అమ్మవారికి, వేణుగోపాల స్వామివారికి పూజలు నిర్వహించారు. శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని గజవాహనంపై, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధి సేవలకు తీసుకెళ్లారు. అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 17వ పాశురాన్ని విన్నపం చేశారు. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా వైష్ణవ స్వామి ద్రవిడ వేదపారాయణం నిర్వహించిన అనంతరం రాత్రి తిరువీధి సేవలు నిర్వహించారు.


