ఉసిరి.. ఉసూరు
ధర లేక
గిరి రైతులకు కష్టాలు
పాడేరు: ఏజెన్సీ అడవుల్లో ప్రకృతి సిద్ధంగా లభించే ఉసిరి కాయలకు జాతీయ స్థాయిలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆయుర్వేద మందుల తయారీ నుంచి ఫార్మా కంపెనీల వరకు అందరికీ ఇక్కడి ఉసిరి కావాలి. కానీ, ప్రాణాలకు తెగించి వీటిని సేకరించే గిరిజన రైతులకు మాత్రం కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. అటవీ సంపదపై ఆధారపడిన గిరిజనుల ఆర్థిక పరిస్థితి దళారుల చేతుల్లో, తక్కువ మద్దతు ధరల వల్ల కుదేలవుతోంది.
అడవుల్లో ఉసిరి సిరి
పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, అరకులోయ, మారేడుమిల్లి వంటి దాదాపు 12 మండలాల్లో ఉసిరి చెట్లు విస్తారంగా ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం వన సంరక్షణ సమితుల ద్వారా నాటించిన మొక్కలు ఇప్పుడు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు గిరిజనులు ఈ కాయలను సేకరిస్తారు. వీటిని వేడినీటిలో ఉడకబెట్టి, ఎండలో ఆరబెట్టి ఉసిరిపప్పుగా తయారు చేసి మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.
పెరిగిన డిమాండ్.. పెరగని ధరలు
తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీలు ఈ ఉసిరి కోసం ఎదురుచూస్తుంటాయి. జాతీయ మార్కెట్‌లో ఉసిరిపప్పు ధర కిలో రూ. 150 నుంచి రూ. 200 వరకు పలుకుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో గిరిజన సహకార సంస్థ, దళారీలు మాత్రం కేవలం రూ. 90 కే కొనుగోలు చేస్తున్నారు.
● గత మూడేళ్లుగా అడవుల్లో కాపు తగ్గడంతో దిగుబడి ఆశాజనకంగా లేదు.
● గిరిజన సహకార సంస్థ గత ఏడాది 10.35 టన్నుల ఉసిరి పప్పును సేకరించింది. దీంతో చిత్తూరులో ’అమ్లా కాండీ’ తయారు చేసి భారీ లాభాలు గడిస్తోంది.
● దళారి వ్యాపారులు కూడా మరో పది టన్నుల ఉసరిపప్పనుతక్కువ ధరకు కొని బయట మార్కెట్‌లో ఎక్కువకు అమ్ముకుంటూ వ్యాపారులు లాభపడ్డారు.
గిట్టుబాటు కావడం లేదు
వన్యప్రాణుల భయం ఉన్నా ప్రాణాలకు తెగించి అడవుల్లో ఉసిరి కాయలు సేకరిస్తాం. ఉడకబెట్టి, ఎండబెట్టి పప్పు చేసేందుకు ఎంతో శ్రమ పడతాం. కానీ కిలో రూ. 90 కంటే ఎక్కువ రావడం లేదు. కనీసం మా కష్టానికి తగ్గ కూలి కూడా మిగలడం లేదు.
– పాంగి భీమేష్, గిరిజన రైతు, డల్లాపల్లి
కొనుగోలు ధర పెంచాలి
మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా రైతులకు మాత్రం అన్యాయ మే జరుగుతోంది. గిరిజన సహకార సంస్థ వెంటనే స్పందించి కొనుగోలు ధరను పెంచాలి. ఫార్మా కంపెనీలు, దళారులు కూడా గిరిజనులను నష్టపరచకుండా మద్దతు ధర ఇవ్వాలి.
– సుడిపల్లి రామానాయుడు,
గిరిజన రైతు, డొంకినవలస.
జాతీయ మార్కెట్‌లో కిలో పప్పు రూ.150 నుంచి రూ.200
స్థానికంగా చెల్లించేది మాత్రం రూ.90
అడుగడుగునా దోపిడీ
గిట్టుబాటు ధర చెల్లించని
గిరిజన సహకార సంస్థ
ఉసిరి.. ఉసూరు


