ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాతగ్గని చలి తీవ్రత
● దట్టంగా పొగమంచు
● పెదబయలులో 12.6 డిగ్రీల నమోదు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ నుంచి పెరుగుతున్నప్పటికీ చలి, మంచు ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ శీతల గాలులు విజృంభిస్తున్నాయి. దీంతో మన్యం వాసులు వణికి పోతున్నారు. గురువారం పెదబయలులో 12.6 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 12.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 13.0 డిగ్రీలు, అరకువ్యాలీలో 13.2 డిగ్రీలు, పాడేరులో 13.5 డిగ్రీలు, హుకుంపేటలో 14.2 డిగ్రీలు, చింతపల్లిలో 15.5 డిగ్రీలు, కొయ్యూరులో 15.7 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన తెలిపారు. చలితీవ్రత నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. మంట కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఉదయం వేళల్లో పది గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. రహదారులను మంచు తెరలు కమ్మేయడం వల్ల వాహనచోదకులు ఇబ్బందులు పడుతూ హెడ్‌లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు.
పెదబయలు: మండలంలో చలి, మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. గురువారం ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు దట్టంగా కమ్మేశాయి.


