వెంకన్నకు నవనీత సేవ
పెందుర్తి: స్థానిక వేంకటాద్రిపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం తిరుప్పావై సేవాకాలం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో 17వ పాశుర విన్నపం చేశారు. అనంతరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వామివారికి నవనీత సేవ ఘనంగా జరిపారు. వేకువజామున తిరుప్పావై పారాయణం, సుప్రభాత సేవ చేశారు. అనంతరం 27 కిలోల వెన్నతో స్వామికి అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన పురోహితుడు రామానుజాచార్యులు ఆధ్వర్యంలో విశేష అర్చనలు జరిగాయి. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు దంపతులు, మేయర్ పీలా శ్రీనివాసరావు దంపతులు, ఎన్‌ఆర్‌ఐ భక్తులు చీమలపాటి మూర్తి కుటుంబ సభ్యులు, దాదాపు 5 వేల మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈవో నీలిమ పర్యవేక్షణలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రసాద వితరణ చేపట్టారు. కొండ దిగువ నుంచి భక్తులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 4న వేంకటాద్రిపై సుదర్శన హోమం నిర్వహించనున్నారు.


