తాటాకిల్లు దగ్ధం
కూనవరం: తాటాకిల్లు దగ్ధం కాగా సుమారు రూ.5 లక్షలు పైగా ఆస్తినష్టం జరిగిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని వేములపల్లి రామారావు నివాసముంటున్న తాటాకిల్లు షార్ట్‌సర్క్యూట్ కారణంగా గురువారం దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో సర్వం కాలిబూడిదైనట్టు బాధితుడు తెలిపారు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ.40వేల నగదు, బంగారపు తాడు, రిఫ్రిజరేటర్, బీరువాలు, ఫ్యాన్లు, దుస్తులు తదితర సామగ్రి మొత్తం కాలిపోయిందని బాధితుడు రామారావు వాపోయారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ.3లక్షలకు పైగా నష్టం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న జెకె ట్రస్ట్ చైర్మన్ జమాల్‌ఖాన్ సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాకి తక్షణ సహాయం కింద రూ.5000 నగదు అందజేశారు. ఇల్లు నిర్మించుకు నేందుకు పైపులు, రేకులు అందజేస్తామని అగ్నిబాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.


