సిటు మహాసభలు జయప్రదం చేయండి
పరవాడ: విశాఖపట్నంలో ఈ నెల 4న సిటు ఆధ్వర్యంలో జరిగే 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సిటు రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఛలో విశాఖ ర్యాలీని పరవాడ ఫార్మాసిటీలో గురువారం నిర్వహించారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆ రోజు జరిగే మహాసభలకు అన్ని రాష్ట్రాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా చర్చించి భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కానున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తున్నారని, ఇప్పటి వరకు ఉన్న హక్కులను కాలరాస్తున్నారని ఆక్షేపించారు. ర్యాలీలో సిటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ, కె.రమణ, ముసిలినాయుడు, శేషు, అప్పలరాజు, సత్తిబాబు పాల్గొన్నారు.


