లేబర్ కోడ్‌లతో బానిసత్వంలోకి కార్మికవర్గం
● ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెలో
పాల్గొనండి
● ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ పిలుపు
సీతంపేట: కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌ల అమలుతో భారతీయ కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నాటి బానిసలుగా మారే ప్రమాదం ఉందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల చట్టబద్ధ హక్కుల రక్షణ కోసం ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ‘లేబర్ కోడ్‌లు– భారతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభావం’అనే అంశంపై బుధవారం ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచిన భారతీయ కార్మిక వర్గం, దేశానికి స్వాతంత్య్రం రాకముందే 8 గంటల పనిదినం, యూనియన్ పెట్టుకునే హక్కు, వేతన చట్టం, బోనస్ చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం వంటివి పోరాడి సాధించుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటన్నింటినీ రద్దు చేసి, లేబర్ కోడ్‌ల రూపంలోకి మార్చి కార్మికులను కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. కొత్త వేతన కోడ్ ద్వారా గతంలో ఉన్న వేతన బోర్డులకు కాలం చెల్లినట్టేనని, జీతాలు ఎగ్గొట్టే యజమానులను నిలదీసే అధికారం లేబర్ కమిషనర్‌కు లేకుండా చేశారని ఆమె మండిపడ్డారు. సోషల్ సెక్యూరిటీ కోడ్ వల్ల కార్మికులు సాధించుకున్న సంక్షేమ బోర్డులు రద్దయ్యాయని, 40 శాతం కార్మిక వర్గాన్ని ఈఎస్‌ఐ, పీఎఫ్ పథకాలకు దూరం చేశారని వివరించారు. సమ్మె చేయాలంటే 50 శాతం మంది ఆమోదం ఉండాలని, 60 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. దేశ సంపదను సృష్టించిన విశాఖ స్టీల్ ప్లాంట్, విమానయానం, బొగ్గు, చమురు, విద్యుత్ వంటి కీలక రంగాలన్నింటినీ అదానీ వంటి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దీని వల్ల దేశం మళ్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నాటి పరిస్థితుల్లోకి, కార్మికులు బానిసత్వంలోకి నెట్టివేయబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వ రంగాన్ని కాపాడుకోవడానికి జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె. అచ్యుతరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘం నాయకులు బి.సి.హెచ్. మసేన్, డి.ఆదినారాయణ, పడాల రమణ, మన్మథరావు, బూసి వెంకటరావు, కె.సత్యాంజనేయ, వామన మూర్తి, చంద్రశేఖర్, కాశిరెడ్డి సత్యనారాయణ, పడాల గోవింద్, షేక్ మౌలాలి పాల్గొన్నారు.


