దేశ రక్షణ కోసం మరో స్వాతంత్య్ర పోరాటం అవసరం
సినీ దర్శకుడు, నటుడు, రచయిత బాబ్జీ
ఏయూక్యాంపస్ : దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర సమరం సాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, రచయిత బాబ్జీ పేర్కొన్నారు. ‘సిటూ’ జాతీయ మహాసభలు సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ ఐదో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ ఉక్కు సహా.. దేశంలోని అన్ని వనరులనూ ఇద్దరు గుజరాతీలు అమ్మకానికి పెట్టగా.. ఇద్దరు గుజరాతీలు కొనుక్కుంటున్నారుని అన్నారు. దేశ రక్షణకు పిలుపు ఇస్తే భగత్ సింగ్‌లా ఉరికంబం ఎక్కడానికై నా తాను సిద్ధమేనని.. తాను ప్రజానాట్యమండలి బిడ్డనని.. ఎర్ర సినిమా తీయాలనే.. సినీ రంగాన్ని ప్రక్షాళన చేయడానికే సినీ రంగంలోకి వెళ్లానని తెలిపారు. అత్యంత శక్తిమంతమైన మాధ్యమం సినిమా రంగాన్ని కూడా ప్రజాసంఘంగా గుర్తించాలని ఆకాక్షించారు. ప్రత్యేక అతిథి ప్రొఫెసర్ కె.ఎస్.చలం మాట్లాడుతూ అదానీ, అంబానీలు దేశీయ పెట్టుబడిదారులు మాత్రమే కాదని, వారు అంతర్జాతీయ పెట్టుబడిదారులని వివరించారు. కార్మిక ధర్మనీతి–2025 చట్టం మనుధర్మ ప్రాతిపదికన చేసినట్లు పాలకవర్గమే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. సమస్యలపై పోరాటాలు మరింత క్రియాశీలకంగా సాగాలని ఆకాంక్షించారు. సిటూ రాష్ట్ర నాయకురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ అభివృద్ధి సంక్షేమం, అచ్ఛేదిన్ అంటుంటాయంటూ.. సంపద అతి కొద్ది మంది వద్దే ఉండటమేనా అచ్ఛేదిన్ అని ప్రశ్నించారు. అంగన్‌వాడీ, ఆశ సిబ్బందిని కార్మికులుగా గుర్తించాలని అంతర్జాతీయ కార్మిక సంఘం సిఫార్సులనూ పట్టించుకోని ప్రభుత్వ తీరును ఖండించారు. తొలుత సిటు రాష్ట్ర నాయకులు కె.అజయ్‌కుమార్ స్వాగతం పలికారు. సభలో శ్రామిక ఉత్సవ్ కన్వీనర్ రమాప్రభ తదితరులు పాల్గొన్నారు.


