ప్రసూతి నిరీక్షణ కేంద్రాలను పూర్తి చేయండి
పెదబయలు: ప్రసూతి నిరీక్షణ (బర్త్ వెయిటింగ్) కేంద్రాల సేవలు అందుబాటులోకి తేవాలని అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి సూచించారు. మంగళవారం ఆమె మండలంలోని మారుమూల రూడకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడారు. పీహెచ్‌సీలో రోజు వారీ ఓపీ వివరాలు, ఎక్కువగాఏ వ్యాధికి సంబంధించి రోగులు వస్తున్నారని ఆమె ఆరా తీశారు. క్షయ రోగులు ఎక్కువగా ఉన్నందున నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. పీహెచ్‌సీ పరిఽధిలో ఉన్న 120 మంది ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తే వారితో మాట్లాడి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాత అంబులెన్సు వాహనంతో ఇబ్బందులు పడుతున్నందున ఇటీవల ఎంపీ నిధులతో కొత్త వాహనం సమకూర్చామన్నారు. పీహెచ్‌సీలో ల్యాబ్, అన్ని గదులను ఆమె పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన బర్త్ వెయింటింగ్ హాల్, సిబ్బంది కార్టర్ల నిర్మాణం 90 శాతం పూర్తయినందున మిగతా 10శాతం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని గిరిజన సంక్షేమ ఈఈని కోరారు. వైద్య సేవలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలన్నారు. గత ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేసిందని, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాతారి సురేష్‌కుమార్. ఎంపీటీసీ వంటారి సంగీత, మాజీ ఎంపీటీసీ జాంబవతి, మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.


