17 నిమిషాల పోరాటం
సీలేరు: స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారులు తమ అసాధారణ ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తితో ఒక పసికందు ప్రాణాన్ని కాపాడారు. మృత్యువుతో పోరాడుతున్న శిశువుకు పునర్జన్మ ప్రసాదించి ’వైద్యో నారాయణో హరి’ అని నిరూపించారు. వివరాలిలా ఉన్నాయి. గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ రాళ్లగెడ్డ గ్రామానికి చెందిన కిలో రమేష్ భార్య భగవతి ప్రసవం కోసం స్థానిక పీహెచ్‌సీలో చేరారు. సోమవారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ సమయంలో వైద్యాధికారులు బాబ్జి, నారాయణరావు ఇతర సిబ్బందితో కలిసి విధుల్లో ఉన్నారు. శిశువు జన్మించిన వెంటనే ఊపిరి అందకపోవడంతో పరిస్థితి విషమించింది. గుండె నుంచి ఇతర అవయవాలకు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో శిశువు శరీరం మొత్తం నలుపు రంగులోకి మారిపోయింది. పసికందు కనీసం ఏడవకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వైద్యాధికారులు బాబ్జి, నారాయణరావు ఏమాత్రం అధైర్యపడకుండా వెంటనే రంగంలోకి దిగారు. సుమారు 17 నిమిషాల పాటు నిరంతరాయంగా శిశువు కాళ్లు, వీపు, గుండైపె తడుతూ రక్త ప్రసరణ జరిగేలా శ్రమించారు. వారి నిరంతర శ్రమ ఫలించి, శిశువు ఒంటి రంగు మారి ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించింది. దీంతో అప్పటివరకు ఉత్కంఠగా ఉన్న ఆసుపత్రి వాతావరణంలో ఆనందం నెలకొంది. శిశువు కొంత ఉమ్మనీరు తాగడంతో, మెరుగైన చికిత్స కోసం పాపను చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మంగళవారం నాటికి పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారి బాబ్జి ధ్రువీకరించారు. తమ బిడ్డను ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యులకు తల్లిదండ్రులు మరియు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


