కూల్చివేతలు గిరిజనులకేనా?
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. గిరిజనుడికి ఒక న్యాయం, గిరిజనేతరుడికి మరో న్యాయమా అంటూ స్థానికులు విమర్శించారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక రెవెన్యూ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ భూమిలో గిరిజనుడి కట్టడం అక్రమం అని మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అదే వ్యక్తి గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎల్‌పీసీని చూపించినప్పటికీ, అధికారులు లెక్కచేయకుండా గునపాలతో కట్టడాన్ని తొలగించడం గమనార్హం. తహసీల్దార్ భాస్కరఅప్పారావు ఆదేశాల మేరకు ఆర్‌ఐ భాస్కర్, వీఆర్వో రమేష్ అక్రమ కట్టడంపై చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో మండల కేంద్రంలో మధు అనే గిరిజనేతరుడు కూడా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపడుతున్నా, అధికారులు కనీసం ఒక్క ఇటుకను కూడా తొలగించలేదు. దీనివల్ల అధికారుల తీరుపై పక్షపాత ఆరోపణలు వస్తున్నాయి. గిరిజన ప్రాంతంలో అన్ని హక్కులు ఉన్న గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తూ, గిరిజన ప్రాంతంలో ఎటువంటి హక్కులు లేని గిరిజనేతరుడికి ప్రభుత్వ భూమిలో నిర్మించడంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరగా రెవెన్యూశాఖకు చెందిన భూమిలో గిరిజనుడు అక్రమంగా నిర్మించడం వల్ల చర్యలు తీసుకున్నామన్నారు. గిరిజనేతరుడికి నోటీసులు జారీ చేసి, తగు చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి హెడింగ్ కావాలి


