ప్రొటోకాల్‌పై గరంగరం | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌పై గరంగరం

Dec 31 2025 7:14 AM | Updated on Dec 31 2025 7:14 AM

ప్రొటోకాల్‌పై గరంగరం

ప్రొటోకాల్‌పై గరంగరం

మహారాణిపేట(విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రొటోకాల్‌ అమలుపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం వేడీవేడిగా సాగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరు కావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌(విశాఖ), విజయ కృష్ణన్‌(అనకాపల్లి), దినేష్‌ కుమార్‌(ఏఎస్‌ఆర్‌ జిల్లా), సీఈవో నారాయణమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధులకు గౌరవం లేదా?

మండలాల పరిధిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులను పిలవడం లేదని, వారిని గౌరవించాల్సిన అవసరం లేదా అని పలువురు సభ్యులు సూరిబాబు(ఎంపీపీ, అనకాపల్లి), ఈర్లె అనురాధ(జెడ్‌పీటీసీ), సన్యాసిరాజు, నాగమణి, ఉమాదేవి, కర్రి సత్యం, దొండా రాంబాబు తదితరులు ప్రశ్నించారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రొటోకాల్‌ పక్కాగా ఉండేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అనకాపల్లి జిల్లా కొత్తూరులో వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులను అడిగినా సరైన సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. కె.కోటపాడు జెడ్‌పీటీసీ ఈర్లె అనురాధ మాట్లాడుతూ ఇటీవల తన మండలంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆహ్వానించలేదన్నారు. ప్రశ్నిస్తే గంట ముందుగా ఫోన్‌ చేసి రావాలని పిలుస్తున్నారని, ఇదెక్కడి ప్రొటోకాల్‌ అమలు చేయడమో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఒకసారి ప్రశ్నిస్తే, రెండోసారి పొరపాటు చేయకూడదని, కానీ ఇక్కడ అధికారులు పదేపదే తప్పులు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర ఆదేశించారు. ప్రొటోకాల్‌ పాటించని ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేస్తామని సీఈవో నారాయణమూర్తి తెలిపారు.

పింఛన్ల ఏరివేత ఆపండి

ఉమ్మడి విశాఖ జిల్లాలో పింఛన్ల ఏరివేత ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని, ఈ ఏరివేతలో అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తున్నారని గొలుగొండ ఎంపీపీ నాగమణి ఆరోపించారు. బుచ్చయ్యపేట జెడ్‌పీటీసీ దొండపూడి రాంబాబు మాట్లాడుతూ అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారని, అర్హులకు తొలగిస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ల విషయంలో దివ్యాంగులను ఇబ్బంది పెట్టడం తగదని జెడ్‌పీటీసీ ఈర్లె అనురాధా కోరారు.

పల్లె రోడ్ల దుస్థితిపై సర్వత్రా గగ్గోలు

ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాల్లో రోడ్ల దుస్థితిపై ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డాది, చోడవరం, రోలుగుంట, నర్సీపట్నం, గొలుగొండ, తదితర మండలాల్లోని గ్రామాల్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని మాడుగుల ఎంపీపీ తాళ్లపూడి వెంకట రాజారామ్‌ వివరించారు. ఈ మార్గాల్లో ప్రయాణించడం గగనంగా మారిందని వాపోయారు. రోడ్ల పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని రాజారామ్‌ అధికారులను ప్రశ్నించారు. దేవరాపల్లి మండలంలో కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని జెడ్‌పీటీసీ సభ్యుడు కర్రి సత్యం అన్నారు. కోటవురట్ల మండలంలో కూడా రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయని జెడ్‌పీటీసీ సభ్యురాలు ఉమాదేవి తెలిపారు.

సీపీఎం నాయకుడు అప్పలరాజును విడుదల చేయాలి

సీపీఎం నాయకుడు అప్పలరాజుపై పెట్టిన పీడీ కేసును ఎత్తి వేయాలని పలువురు సభ్యులు కోరారు. బల్క్‌ డ్రగ్‌ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అప్పలరాజుపై పీడీ యాక్టు నమోదు చేయడం దారుణమని అనంతగిరి జెడ్‌పీటీసీ డి.గంగరాజు అన్నారు. ఆయనకు మద్దతుగా పలువురు వైఎస్సార్‌సీపీ సభ్యులు, నక్కపల్లి జెడ్పీటీసీ గోసల కుశలమ్మ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, లాలం రాంబాబు తదితరులు మాట్లాడారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాలుష్యంపై ఆందోళన

పరవాడలో వివిధ పరిశ్రమల కారణంగా కాలుష్యం సమస్య అధికంగా ఉందని జెడ్‌పీటీసీ పైలా సన్యాసిరాజు అన్నారు. పలు లారీలు ఓవర్‌ లోడుతో వెళ్తుండడంతో రోడ్లు ఛిద్రమయ్యాయని చెప్పారు. అయినా కాలుష్య నివారణ అధికారులు, ఆర్‌టీవో, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అచ్యుతాపురంలో కూడా కాలుష్య సమస్య అధికంగా ఉందన్నారు. లంకెలపాలెం జంక్షన్‌లో కాలుష్యం కారణంగా కనీసం 10 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రజాప్రతినిధుల బినామీలే లారీల కాంట్రాక్టులను దక్కించుకోవడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని సన్యాసిరాజు ఆరోపించారు. పలు ప్రాంతాల నుంచి మట్టి అక్రమ తరలింపుపై గనుల శాఖ అధికారులు సమాధానం చెప్పాలని మాడుగుల ఎంపీపీ తాళ్లపూడి వెంకట రాజారామ్‌ డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మూడు జిల్లాల అధికారులు, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి, కె.రాజ్‌కుమార్‌, పరిపాలనాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మౌనం పాటిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, చిత్రంలో కలెక్టర్లు హరేందిర ప్రసాద్‌, విజయ కృష్ణన్‌, దినేష్‌కుమార్‌

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో కొయ్యూరు జెడ్పీటీసీ సభ్యుడు వి.నూకరాజు మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు మాట్లాడుతూ నూకరాజు సేవలను కొనియాడారు.

ప్రొటోకాల్‌ అమలుపై జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభ్రద, కలెక్టర్ల ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు

మండలాల్లో అభివృద్ధి పనులకు ఆహ్వానం లేకపోవడంపై జెడ్పీటీసీల ఆగ్రహం

బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా నినాదాలు

వాడీవేడిగా జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరుపై

గుసగుసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement