పెండింగ్ మ్యుటేషన్లు పూర్తి చేయండి
పాడేరు : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లు, రీసర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్‌చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. ఐటీడీఏలోని తన చాంబర్ నుంచి మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న భూ సంబందిత సర్వేలపై ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తామన్నారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లు, రీసర్వే సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలన్నారు. స్మార్ట్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, తొలగింపు సమగ్ర సమాచారంతో చేపట్టాలన్నారు. పీఎం జన్‌మన్ పథకంలో నిర్మిస్తున్న గృహాల పనులు వేగవంతం చేయాలన్నారు. జీవో నంబరు 23ప్రకారం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు గుర్తించాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.


