విద్యార్థుల మరణాలు ప్రభుత్వానికి పట్టవా?
సీలేరు: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సంభవిస్తున్న విద్యార్థుల వరుస మరణాలు ప్రభుత్వానికి పట్టవా? అని డీఎల్‌వో రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర మార్క్ రాజ్. జిల్లా ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్ ప్రశ్నించారు. తరచూ విద్యార్థులు మరణిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. మంగళవారం వారు మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి చెందిందని ఆరోపించారు. ఆశ్రమ పాఠశాలల్లో పర్యవేక్షణ అధికారులు లేకపోవడం దారుణమన్నారు. సీలేరు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎక్కడికి వెళ్లిపోయారో ఐటీడీఏ పీవో సమాధానం చెప్పాలి డిమాండ్ చేశారు. 270 మంది ఉన్న పాఠశాలలో కేవలం ఒకే ఒక్క వంట మనిషి ఉండటం, ఒక వైద్య సిబ్బంది కూడా లేకపోవడం దారుణమన్నారు.
పర్యవేక్షణ లేకే అవాంఛనీయ ఘటనలు
గూడెంకొత్తవీధి: సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ సంక్షేమ ఆశ్రమాల్లో అనేక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ ఎంపీటీసీ అంపురంగి బుజ్జిబాబు అన్నారు . మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గూడెంకొత్తవీధి మండలంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో వేలాది మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారన్నారు. వీరి బాగోగులు, ఇబ్బందులపై సరైన పర్యవేక్షణ ఉండటం లేదన్నారు. ఇటీవల కాలంలో గూడెంకొత్తవీధి మండలంలోని పలు పాఠశాలల్లో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. గతంలో మండలానికి సహాయ గిరిజన సంక్షేమాధికారి ఉండేవారని, ఆ పోస్టును ప్రభుత్వం రద్దుచేసిందని చెప్పారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాలను ఒకే అఽధికారి పర్యవేక్షించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. తక్షణమే గూడెంకొత్తవీధి మండలానికి ఏటీడబ్ల్యూవోను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.


