కురిడి ఫ్లైఓవర్‌పై నీలినీడలు
● రెండేళ్లుగా ప్రకటనలకే పరిమితం
● భూముల సమస్యలంటున్న రైల్వేశాఖ
● కేకే లైన్‌లో రోజూ 30 రైళ్ల రాకపోకలు
● రైల్వే గేటు పడితే అవస్థలే
● 108,అంబులెన్స్ సర్వీసులకు ఆటంకం
● జాతీయ రహదారితో పెరిగిన వాహనాల రద్దీ
సాక్షి, పాడేరు: కొత్తవలస–కిరండోల్ రైల్వే లైన్‌లోని కురిడి ఫ్లై ఓవర్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది రెండేళ్లుగా ప్రకటనలకే పరిమితమైంది.అరకులోయ నుంచి పాడేరు మీదుగా రాజమండ్రికి వెళ్లే జాతీయ రహదారిలో ఉన్న కురిడి రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి రైల్వేశాఖ, జాతీయ రహదారుల విభాగం రూ.7కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించాయి. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయినప్పటికీ కురిడి రైల్వేగేటు వద్ద ఇరువైపులా రోడ్డు విస్తరణ, బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో పాత రోడ్డు మీదుగా రైల్వే ట్రాక్‌ను దాటుతూ వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి.
పెరిగిన వాహనాల రద్దీ
విజయనగరం నుంచి రాజమండ్రి వరకు రెండు వరుసల జాతీయ రహదారి నిర్మించడంతో వాహనాల రద్దీ ఇటీవల అధికమైంది. పర్యాటక సీజన్ కావడంతో గత రెండు నెలల నుంచి వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.అలాగే పాడేరు నుంచి అరకులోయ ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు అధికంగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు సుమారు 500 వాహనాలు ఈ జాతీయ రహదారిలో నడుస్తున్నాయి.
గేటు పడితే నరకయాతనే..
డుంబ్రిగుడ మండల పరిధిలో ఉన్న కురిడి రైల్వేగేటు పడితే వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తవలస–కిరండోల్ రైల్వే లైన్‌లో కురిడి ట్రాక్‌పై ప్రతి రోజు ఎక్స్‌ప్రెస్, పాసింజర్, సరకు రవాణా చేసే గూడ్స్ రైళ్లు 30 వరకూ నడుస్తున్నాయి. పగలు,రాత్రి ఈ ట్రాక్‌పై రైళ్ల రద్దీ అధికంగా ఉంటుంది. రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో కురిడి వద్ద గేటు పడితే ఇరువైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. రైళ్లు వెళ్లే వరకు ఆర్టీసీ బస్సులతో పాటు అన్ని వాహనాలు చాలా సమయం నిరీక్షించాల్సి వస్తోంది. రోగులను 108, అంబులెన్స్‌లలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించే సమయంలో గేటు పడితే రోగులతో పాటు బంధువులు నరకయాతన పడుతున్నారు. డుంబ్రిగుడ ప్రాంత అత్యవసర రోగులను పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు ఇదే ప్రధాన రహదారి. రైళ్లు వెళ్లిపోయే వరకు అన్ని వాహనాలు నిలిచిపోతుండడంతో ప్రయాణానికి ఆలస్యమవుతుండడంతో వాహన చోదకులు, పర్యాటకులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
భూముల సమస్యకు పరిష్కారమెప్పుడో?
కురిడి రైల్వేగేటులో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూ సమస్య ఏర్పడిందని సమాచారం. రెవెన్యూ, రైల్వే, అటవీశాఖలకు చెందిన భూములు సిద్ధంగా ఉన్నాయి. అయితే వంతెన నిర్మించే ప్రాంతంలో గిరిజన రైతుల భూములు అధికంగా ఉండడంతో కొంత వివాదం నెలకొందని తెలిసింది. ఈ సాకుచూపి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టడడంలో జాతీయ రహదారులు, రైల్వేశాఖ అధికారులు జాప్యం చేస్తుండడం సమంజసం కాదని, అన్ని సమస్యలు పరిష్కరించి పనులు ప్రారంభించాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు.
ఫ్లైఓవర్ నిర్మించాల్సిన కురిడి రైల్వేగేటు వద్ద
నిలిచిన వాహనాలు
కురిడి ఫ్లైఓవర్‌పై నీలినీడలు


