కొత్త జిల్లా
ఒకే ఒక్క నియోజకవర్గంతో
రంపచోడవరం: ఒకే ఒక నియోజకవర్గంతో రంపచోడవరం జిల్లా ఏర్పడింది. రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు సోమవారం ఆమోదం తెలిపింది. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో 12 మండలాలను కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 సంవత్సరంలో పాడేరు, అరకు, రంపచోడవరం నియో జకవర్గాలను కలిపి కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేశారు. తాజాగా అల్లూరి జిల్లా నుంచి రంపచోడవరం నియోజకవర్గాన్ని వేరుచేసి, ఒక్క నియోజకవర్గంతోనే కొత్తగా రంపచోడవరం జిల్లాను ఏర్పాటు చేశారు. దీంతో అల్లూరి జిల్లాలో 11 మండాలుంటాయి.
12 మండలాలు.. రెండు రెవెన్యూ డివిజన్లు
రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్న 11 మండలాలున్నాయి. కొత్తగా గుర్తేడు మండలాన్ని ఏర్పాటుచేస్తున్నారు. దీంతో 12 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లా ఏర్పాటవుతోంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో ఎనిమిది మండలాలు.. రంపచోడవరం, వై.రామవరం, మారేడుమిల్లి,దేవీపట్నం,గంగవరం,రాజవొమ్మంగి, అడ్డతీ గల, కొత్తగా ఏర్పాటు చేస్తున్న గుర్తేడు ఉండగా, చింతూరు రెవెన్యూ డివిజన్‌లో నాలుగు మండలాలు చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఎటపాక ఉన్నాయి. రంపచోడవరం, చింతూరుల్లో ఐటీడీఏలున్నాయి.
కొత్త మండలం ఏర్పాటు
వై.రామవరం మండలంలో ఎగువ ప్రాంతంలో ఉన్న ఐదు పంచాయతీలను కలిపి కొత్తగా గుర్తేడు మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రంపచోడవరం నియోజవర్గంలో 3,49,799 మంది జనాభా ఉన్నా రు. అలాగే 2,55,313 మంది ఓటర్లు ఉన్నారు. రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో 120, చింతూరు రెవెన్యూ డివిజన్‌లో 69 కలిపి మొత్తం 189 పంచాయతీలు, 827 రెవెన్యూగ్రామాలున్నాయి. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ భౌగోళికంగా 4433.38 స్క్వేర్ కిలోమీటర్లు, చింతూరు రెవెన్యూ డివిజన్ 2095.14 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంది.
అపారమైన ఖనిజ సంపద
ఇక్కడ అపారమైన ఖనిజ సంపద ఉంది.రంపచోడవరం డివిజన్‌లో మెటల్, పాలరాయి, గ్రావెల్ క్వారీలు ఉన్నాయి.రంపచోడవరం, గంగవరం మండలాల్లో పాలరాయి, నల్లరాయి మెటల్ క్వారీలు ఉన్నాయి. అడ్డతీగల మండలంలో ఎక్కువగా మెట ల్ క్వారీలు ఉన్నాయి. చింతూరు ప్రాంతంలో క్వార్జ్ నిక్షేపాలు, ఎటపాక మండలంలో ఇసుక రీచ్ ఉంది.
పాపికొండలు
ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన పాపికొండలు జిల్లాలోనే ఉన్నాయి. ఏటా వేలాది మంది పర్యాటకులు ఈప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద ఒకటి, వీఆర్‌పురం మండలంలో ఒకటి పర్యాటక బోటు పా యింట్లు ఉన్నాయి. మారేడుమిల్లి ప్రాంతంలో పర్యాటకులకు అతిథ్యం ఇచ్చేందుకు అనేక పర్యాటక వసతి గృహాలు, గుడిసె హిల్ స్టేషన్ ఉన్నాయి. పొల్లూరు వద్ద వాటర్ పాల్స్, రంప జలపాతం ఉన్నాయి.
● ఇక్కడే పాపికొండలు నేషనల్ పార్కు 1,05,690.32 హెక్టార్లుల్లో విస్తరించి ఉంది. జాతీయ ప్రాజెక్టు పోలవరం విద్యుత్ కేంద్రం జిల్లాలోనే పోశ మ్మ గండి సమీపంలోని నిర్మాణం జరుగుతోంది.
నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు
కొత్త జిల్లాలో నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నా యి. రంపచోడవరం మండలంలో ముసురుమిల్లి, భూపతిపాలెంలలో, గంగవరం మండలంలో సూరంపాలెం, అడ్డతీగల మండలంలో మద్దిగెడ్డలో రిజర్వా యర్లు ఉన్నాయి. వీటి ద్వారా గిరిజన రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. జిల్లాలో వరి, మొక్క జొన్న,పత్తి, అరటి, జీడిమామిడి, పొగాకు పంటలను ఎక్కువగా పండిస్తారు. మారేడుమిల్లిలో మాత్రమే రబ్బరు, కాఫీ, జాఫ్రా, నిమ్మ సాగుచేస్తున్నారు. 54,344 హెక్టార్లలో వివిధపంటలు సాగవుతున్నాయి
● చింతూరు మండలంలోని పొల్లూరు, వై రామవరం మండలంలోని డొంకరాయిలో రెండు జలవిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి.
● కొండరెడ్డి, కోయదొర, కొండకమ్మరి, వాల్మీకి, కొండకాపు తెగుల గిరిజనులు ఇక్కడ అధికంగా ఉన్నారు. వీరిలో కోయదొరలు, కొండరెడ్డి జనాభా ఎక్కుగా ఉంది.
రంపచోడవరం వ్యూ
జిల్లా వివరాలు
విస్తీర్ణం : 6528.52 స్క్వేర్ కిలోమీటర్లు
అడవుల విస్తీర్ణం: 53,771.85 హెక్టార్లు
పంట భూములు : 54,344 హెక్టార్లు
జనాభా : 3,49,799 మంది
ఓటర్లు : 2,55,313 మంది
ఐటీడీఏలు : రెండు (రంపచోడవరం, చింతూరు)
డివిజన్లు : రెండు (రంపచోడవరం, చింతూరు)
మండలాలు : 12 (కొత్తగా ఏర్పాటైన గుర్తేడుతో)
పంచాయతీలు : 189
గ్రామాలు : 827
జిల్లా పరిధిలో రెండు ఐటీడీఏలు,
12 మండలాలు
కొత్తగా గుర్తేడు మండలం ఏర్పాటు
కొండలు, అడవులతో విస్తరించిన
రంపచోడవరం జిల్లా
కొత్త జిల్లా


