ఈవీఎంల గోదాముల తనిఖీ
గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ దినేష్‌కుమార్ సోమవారం తనిఖీ చేశారు. ఈవీఎం గోదాముల గదుల సీల్ ఓపెన్ చేయించి, ఈవీఎంలను భద్రపరిచిన బాక్సులను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ప్రధాన ద్వారాలకు ఉన్న సీళ్ల ను పరిశీలించారు. ఈవీఎంల గోదాంలో భద్రతా చర్యలపై అక్కడి అధికారులు, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం నెలవారీ తనిఖీల రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో అంబేడ్కర్, వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బుటారీ వెంకటరావు, టీడీపీ ప్రతినిధి రాజేష్, బీజేపీ ప్రతినిధి కె.ఆర్.రావు, ఎన్నికల సూపరింటెండెంట్ లక్ష్మణరావు, పాడేరు, అరకు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


