బండరాళ్ల పేలుళ్లతోనిలిచిన ట్రాఫిక్
● అరగంటసేపు నిలిచిన వాహనాలు
● ఇబ్బందులు పడిన అన్నివర్గాల ప్రజలు
జి.మాడుగుల: జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అడ్డంగా ఉన్న బండరాళ్లను పేల్చడం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. పాడేరు–జి.మాడుగుల రోడ్డు మార్గంలో ఆదివారం బందవీధి వెన్నెలమ్మతల్లి ఘాట్‌లో నిర్మాణదారులు బండరాళ్లను పేల్చారు. ముందస్తు సమాచారం లేకుండా చేపట్టడం వల్ల సుమారు 30 నిమిషాలు ట్రాఫిక్ స్తంభించింది. అరకిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోవడంతో అత్యవసర పనులపై వెళ్లే ప్రజలు, అధికారులు, రాజకీయ నేతలు, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్మాణ సంస్థ అనుసరిస్తున్న విధానాలపై వారు విమర్శలు చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు పేలుళ్లు జరపడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


