ఉత్తరద్వార దర్శనానికి సింహగిరి సిద్ధం
రేపు ఉదయం 5.30 గంటల నుంచి 11 గంటల వరకు వైకుంఠవాసుడిగా దర్శనమివ్వనున్న అప్పన్న సుమారు 50వేల మంది భక్తులు వస్తారని అంచనా అన్నిశాఖల సమన్వయంతో విశేషంగా ఏర్పాట్లు : ఈవో సుజాత
సింహాచలం : ఆధ్యాత్మిక క్షేత్రం సింహాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 50 వేల మంది భక్తులు వస్తారని దేవస్థానం అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసు, జీవీఎంసీ, వైద్యారోగ్య, విద్యుత్ శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య దర్శనానికి పెద్దపీట వేస్తూ, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వైదిక కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే ఆలయంలో సుప్రభాత సేవ, ఆరాధన వంటి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని వైకుంఠ నారాయణుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై వేంజేంపు చేస్తారు. తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర ద్వారం వద్ద మేలిముసుగు తొలగించి, ఆనువంశిక ధర్మకర్తలకు తొలి దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు సాధారణ భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది. ఉదయం 11 గంటల తర్వాత స్వామివారిని మాడ వీధుల్లో తిరువీధి మహోత్సవం నిర్వహిస్తారు.
5 కి.మీ. మేర క్యూ లైన్ల ఏర్పాటు
దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం సుమారు ఐదు కిలోమీటర్ల మేర క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 ప్రత్యేక దర్శన క్యూలైన్లు అందుబాటులో ఉంటాయి. క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈసారి ఆలయం లోపల నీలాద్రి గుమ్మం వద్ద నుంచే మూలవిరాట్ లఘు దర్శనం కల్పిస్తారు. వీఐపీలకు సైతం అంతరాలయంలో ఎటువంటి పూజలు ఉండవు. భద్రత కోసం అదనపు సీసీ కెమెరాలు, 190 మందికి పైగా పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
నేటి సాయంత్రం 6 గంటల వరకే
ప్రైవేటు వాహనాలకు అనుమతి
సోమవారం సాయంత్రం 6 గంటల వరకే ప్రైవేట్ వాహనాలను కొండపైకి అనుమతిస్తారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి ఆర్టీసీ, దేవస్థాన బస్సులు షటిల్ సర్వీసులుగా భక్తులను కొండపైకి చేరుస్తాయి. ప్రసాదాల విషయానికి వస్తే లక్ష లడ్డూలను సిద్ధం చేశారు. భక్తులందరికీ ఉచిత అన్నప్రసాద వితరణ ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం ఆరు చోట్ల వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిత్య కల్యాణం వంటి ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు విరామం మినహా సాయంత్రం 7 గంటల వరకు మూలవిరాట్ దర్శనం లభిస్తుంది. 29వ తేదీ సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు కొనసాగుతాయి.
ఉత్తరద్వార దర్శనానికి సింహగిరి సిద్ధం


